ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రభ న్యూస్ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టిడిపి శ్రేణులు రోడ్డెక్కి నిరసనలకు దిగాయి. కొన్ని ప్రాంతాల్లో పార్టీ జెండాలు చేత భూమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వాహనం వస్తున్న సమాచారం తెలుసుకొని వినుకొండ, శావల్యాపురం, నరసరావుపేట, ఫిరంగిపురం, పేరిచర్ల, గుంటూరు బైపాస్లలో భారీగా టిడిపి శ్రేణులు మోహరించాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద బందోబస్తు కొనసాగిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులను హౌస్ అరెస్టు చేశారు. గుంటూరు నగరంలోని తూర్పు పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జిలు కోవెలమూడి నాని, నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టిడిపి శ్రేణుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.