ఏపీలో వరద బాధితుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారికి ఒక్కో ఇంటికి రూ.25 వేలు.. ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి 10వేలు పరిహారం రూపంలో ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. అంతేకాక, నష్టపోయిన పరిశ్రమలకు కూడా ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు. ఏపీ సెక్రటేరియట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
భారీ వర్షం, వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఇక టూవీలర్స్ దెబ్బతిన్న వారికి రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని అన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన వారిలో ఒక హెక్టారు (2.47 ఎకరాలు) పత్తికి రూ.25 వేలు, వేరు శనగకు రూ.15 వేలు, హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్, రెస్టిరేషన్కు కూడా రూ.15 వేలు, పసుపు, అరటికి రూ.35 వేలు, మొక్క జొన్న, కొర్ర, సామ, రాగులకు హెక్టారుకు రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వరి ఎకరాకు రూ.10 వేలు, చెరకు రూ.25 వేలు పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. మత్స్యకారుల విషయంలో ఫిషింగ్ బోట్, వల పాక్షికంగా దెబ్బ తింటే రూ.9 వేలు, పూర్తిగా దెబ్బతింటే రూ.20 వేలు ఇస్తామని తెలిపారు.