అమరావతి: ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వరద పరిస్థితిపై సోమవారం ఉదయం విజయవాడ కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలన్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలన్నారు. బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయన్నారు. బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్నారు.. అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచాలని ఆదేశించారు.
బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్నారు. మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు అధికారులు వివరించారు.నాతో సహా అందరూ బృందాలుగా ఏర్పడాలిఉదయం 8 గంటల కల్లా ఎంత మందికి ఆహారం అందించారని సీఎం ఆరా తీశారు. సుమారు లక్షన్నర మంది వరకు ఆహార పంపిణీ జరిగిందని అధికారులు తెలిపారు.
విపత్తు సమయంలో వరద బాధితులు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ వారి కోసమే కేటాయించాలన్నారు. కృష్ణానది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. గండిని పూడ్చగలిగామని సీఎంకు అధికారులు వివరించారు. రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవను ముఖ్యమంత్రి అభినందించారు. కరకట్ట వెంట గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలన్నారు. తనతో సహా అధికారులంతా బృందంగా ఏర్పడాలని స్పష్టం చేశారు
.సింగ్‌నగర్‌లో సీఎం పర్యటన.
.విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో చంద్రబాబు నేటి ఉదయం పర్యటించారు. జోరు వర్షంలో బోటు ఎక్కి సింగ్ నగర్ లోపలికి వెళ్లారు. దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న వరద నీటిని సీఎం పరిశీలించారు. బాధితులకు ఉదయమే ఆహారం అందిందా? లేదా? అని చంద్రబాబు ఆరా తీశారు. ఆహారం, రక్షిత మంచి నీరు అందాయని బాధితులు ఆయనకు తెలిపారు.
అర్థరాత్రి … స్వయంగా ఆహారం పంపిణీ..
గత అర్థరాత్రి రెండో సారి సింగ్ నగర్ లో బుడమేరు బాధితుల వద్దకు చంద్రబాబు పర్యటించారు. చీకట్లో టార్చ్ లైట్ వెలుగులో ముంపు ప్రాంతాల్లో రాత్రి 12 గంటల సమయంలో బోట్ లో వెళ్లి ముంపు ప్రాంతంలో ఉన్న బాధితులకు స్వయంగా ఆహారం అందజేసారు. భారీ వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో చంద్రబాబు రాత్రంతా మెలకువగా ఉండి పర్యటించారు. నిన్న ఉదయం అజిత్‌సింగ్‌నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి అర్ధరాత్రి రెండోసారి అజిత్‌సింగ్‌నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. బోటులో అర్ధరాత్రివేళ ప్రయాణం ప్రమాదమని భద్రతా సిబ్బంది వారించినా చంద్రబాబు వినిపించుకోలేదు. తెల్లవారుజామున 4 గంటల వకు సుడిగాలి పర్యటన చేశారు. సెల్‌ఫోన్ కెమెరా లైట్ల వెలుతురులో అరగంట పాటు పర్యటించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఆహార ప్యాకెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వరదనీటిలో చిక్కుకున్న కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాటి హుద్‌హుద్ విలయం, నేటి విపత్తు వేర్వేరని, ఇక్కడ నీరు సమస్యగా ఉందని పేర్కొన్నారు. బోట్లలో వెళ్తే తప్ప బాధితుల వద్దకు చేరుకోలేకపోతున్నామని, నీరు క్రమంగా తగ్గుతోందని చెప్పారు.
వరదల్లో చిక్కుకున్న అందరినీ రక్షిస్తామని, ఎన్‌డీఆర్ఎఫ్ బోట్లతో ఆపరేషన్ ప్రారంభిస్తామని సీఎం వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం విజయవాడ కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన బస్సులో చంద్రబాబు విశ్రాంతి తీసుకున్నారు. మరి కాసేపట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు మరోమారు పర్యటించనున్నారు.
లక్షమందికి ఆహారం
కనకదుర్గమ్మ ఆలయం ద్వారా వరద బాధితులకు ఆహారం తయారు చేసి అందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 50 వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, విజయవాడలోని ప్రైవేటు హోటళ్ల యజమానులతో మాట్లాడి లక్షమందికి ఆహారం సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.