ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నెలకొల్పుతామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి మద్రాసు నుంచి తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోసం.. పొట్టి శ్రీరాములు సాగించిన మహత్తర పోరాటం మరువలేనిదన్నారు. ఆయన త్యాగంతో మనమంతా తెలుగు వాళ్లం అంటున్నామని అన్నారు. తెలుగు జాతి కోసం ఆలోచన చేసి ప్రాణత్యాగంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. 58 రోజులు ఆమరణ దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ సాధించారని ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు. ఆ దీక్ష.. త్యాగం మరువలేనివి నేటి ఆమరణ దీక్షలు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారని, కానీ ఒక వ్యక్తి త్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయని సీఎం చంద్రబాబు అన్నారు.
తాను చనిపోయినా పరవాలేదు అని మన తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని గుర్తుచేశారు. ఒక్కోసారి మంచి చేసినా ఎన్నో ఇబ్బందులు పడాలన్నారు. ఆయన కాడి మోయడానికి నలుగురు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కనీసం మద్దతు పలికేందుకు కూడా నాయకులు రాలేదని చెప్పారు. అయినా పొట్టి శ్రీరాములు తాను అనుకున్నది సాధించారని తెలిపారు.
ఈ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి.. దేశం ఐక్యత కోసం పోరాటం చేశారని తెలిపారు. అలుపెరగని పోరాటంతో ఉక్కు మనిషిగా చరిత్రలో నిలిచి పోయారని సీఎం చంద్రబాబు అన్నారు.స్వార్థంతో రాష్ట్రాన్ని నాశనం చేశారు..
‘‘కొంతమంది నాయకులు దూరదృష్టితో ప్రజలకు ఎంతో మంచి చేశారు. మరి కొంతమంది తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేశారు. ఐదేళ్లల్లో పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి లేకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అభివృద్ధి కావాలని పని చేశాం. 2019 తర్వాత మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఒక్క అభివృద్ధి, ఒక్క ప్రాజెక్టు నిర్మాణం లేకుండా చేశారు. ఆరు నెలల పాలనలో వారి తప్పులను సరి చేయడమే సరిపోయింది. సంపద ప్రతిఒక్క కుటుంబానికి అందాలి, జీవన ప్రమాణాలు మారాలి. అందరూ ఆర్థిక అభివృద్ధితో, సంతోషంగా ఉండాలనేదే విజన్ 2047. ఎవరో కుట్రలు చేస్తే మీరు అందులో భాగస్వామ్యం కావద్దు. మీ నెత్తిన చెయ్యి పెట్టి అధికారంలోకి వచ్చాక మీ ఆస్తులే లాక్కున్న పరిస్థితి.
పొట్టి శ్రీరాములు త్యాగాలతో పాటు, గత పాలకుల పాపాలు కుడా గుర్తు ఉంచుకోండి. అని రాష్ట్ర పరిస్థితిని వివరించారు.మన పరపతి బాగుంది.. నిధులు వస్తున్నాయి లక్షా పాతిక వేలకోట్లు విద్యుత్ భారాలు ప్రజలపై మోపారని సీఎం అన్నారు. ఇప్పుడు కేంద్రంలో మన పరపతి పెరిగింది కాబట్టి నిధులు వస్తున్నాయి.
సుస్థిర పాలనతోనే అభివృద్ధి సాధ్యం అని పవన్ కల్యాణ్ తరచూ చెబుతుంటారు. రూ. 4 వేలు పెన్షన్ ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదు. ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి… వాటిని అధిగమిస్తాం. మంచితో పాటు మనకు చెడు చేసిన వారినీ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తు పెట్టుకోకుంటే రాష్ట్రం మూడు ముక్కలే. 2025 మార్చి 16 నుంచి పొట్టి శ్రీరాములు 125 వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తాం.పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం, ఇంటిని మెమోరియల్‌గా చేస్తాం. రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తాం. 2047 నాటికి మన తెలుగు వారంతా ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలి. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.20-30 లక్షలు ఉండాలి’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.