ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి : ఏపీలో కూటమి సర్కారు ప్రమాణ స్వీకార వేదిక నిర్ణయంపై అధికారులు అన్వేషణలో ఉన్నారు. ఇప్పటికే గన్నవరంలోని మేధా టవర్ సమీపంలో.. అంటే విమానాశ్రయానికి సమీపంలో ప్రమాణ స్వీకార వేదిక నిర్ణయించారు. ఏర్పాట్లల్లో కృష్ణాజిల్లా అధికారులు బిజీబిజీ అయ్యారు. శుక్రవారం అధికారులు గన్నవరంలో మొహరించారు. ఇంతలో ప్రమాణ స్వీకార వేదికకు గన్నవరంలో స్థలం సరిపోదని,.. అక్కడ కాకుండా మరో ప్రాంతాన్ని నిర్ణయించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. రాజధాని అమరావితికి సమీపంలోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ 300 ఎకరాల స్థలం ఉండటంతో ప్రమాణ స్వీకార వేదికకు అనువుగా భావించారు. అదే విధంగా వాహనాల రాకపోకలకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నారు.
అమరావతిలోనే ప్రమాణం చేయాలంటున్న టీడీపీ వర్గాలు..
అమరావతి రాజధాని కోసం 450 రోజులు పైగ పోరాటం జరిగిన నేపథ్యంలో.. అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేపట్టాలని టీడీపీ వర్గాలు తొలుత భావించాయి. కానీ అక్కడకు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కారణంగా అమరావతిలో వద్దన్నారు. ఇక నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటునూ టీడీపీ వర్గాలు వ్యతిరేకించాయి. ఇక్కడ భారీ కార్యక్రమాలు సక్సెస్ కావటంలేదనే సెంటిమెంట్ను వ్యక్త పరుస్తున్నారు. ఏతావాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రమాణ స్వీకార వేదికపై నిర్ణయం ఇంకా కొలిక్కి రాలేదు. ఈనెల 12న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తున్న కారణంగా.. ఈ రోజు సాయంత్రంలోగా వేదికను నిర్ధారించే అవకాశం ఉందని తెలుస్తోంది.