అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిపై ప్రేమను చాటుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలోని మేరీస్ స్టెల్లా కాలజీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ప్రారంభించి చీరలకు పరిశీలించారు. ఈ క్రమంలోనే తన భార్యకు చీరలు కొనుగోలు చేసారు ముఖ్యమంత్రి. చేనేత కార్మికులతో ముచ్చటించిన సీఎం వారు తయారుచేసిన చీరల నాణ్యతను పరిశీలించాయి. అవి ఎంతగానో నచ్చడంతో భార్య కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా భువనేశ్వరి కోసం వెంకటగిరి, ఉప్పాడ జాందాని చీరలను కొనుగోలు చేసారు చంద్రబాబు.
స్వయంగా ముఖ్యమంత్రే తమవద్ద చీరలు కొనుగోలు చేయడంతో చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేసారు. అయితే గతంలో తనకోసం చంద్రబాబు ఓసారి చీర తెచ్చాడని… అది ఘోరంగా వుందని భువనేశ్వరి చేసిన కామెంట్స్ ను ఇప్పుడు నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఈసారైనా భార్యకు నచ్చేలా చీర కొన్నారా సార్ అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలావుంటే చేనేత కార్మికులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…వారికి కూటమి ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. గతంలో టిడిపి ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణాలను ఇచ్చేది… కానీ వైఎస్ జగన్ అధికారంలోకి ఆ రుణాలను రద్దు చేసిందన్నారు. తాను నాలుగోసారి సీఎం అయ్యాక మొదట చేనేత కార్మికులనే కలిసానని…వారి కష్టాలు తనకు తెలుసన్నారు. చేనేత పరిశ్రమను కాపాడేలా ప్రభుత్వ నిర్ణయాలుంటాయని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను కాపాడుకోవడం కేవలం ప్రభుత్వానిదే కాదు ప్రజల బాధ్యత కూడా అని చంద్రబాబు అన్నారు
కాబట్టి ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలని…కనీసం నెలకు ఒక్కసారయినా ఈ వస్త్రాలను ధరించాలన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంగా ఇస్తామని… సౌర విద్యుత్ ప్యానెల్స్ ను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు చేయూత అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు
కృష్ణమ్మ పరవళ్లను చూసి..
విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళుతూ మార్గమధ్యలో ప్రకాశం బ్యారేజీపై ఆగారు చంద్రబాబు. బ్యారేజ్ పై తన కాన్వాయ్ ఆపి కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించారు. అక్కడ వున్నవారిని దగ్గరకు పిలిచి మాట్లాడారు… కొందరు ఆయనతో ఫోటోల దిగారు. బ్యారేజీ వద్ద జలకళ తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రాజెక్టులోని ప్రాజెక్టుల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. .
.