విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన టిడిపి అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సీఐడీ కస్టడీ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ రెండు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపి ఉత్తర్వులిస్తామని పేర్కొంది.
అంతకుముందు రెండు రోజుల కస్టడీ నివేదికను సీఐడీ అధికారులు సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి అందజేశారు. మరో ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. తొలుత బెయిల్ పిటిషన్‌పై విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా ముందుగా కస్టడీ పిటిషన్‌ను విచారించాలని సీఐడీ న్యాయవాదులు అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఏ పిటిషన్ ను ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.