హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి.ఆదినారాయణ గురువారం ఉదయం అపార్టుమెంట్‌పై వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆదినారాయణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈటీవీలో ఆయన పనిచేస్తున్నారు.
కాగా, ఆయన మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలిపారు.
ఆదినారాయణ అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆదినారాయణ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేశారన్నారు. నిజాయతీపరుడైన జర్నలిస్ట్‌గా సమాజంలో మార్పునకు ఎల్లప్పుడూ కృషి చేశారని కొనియాడారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్‌కల్యాణ్
ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం కలిగిన జర్నలిస్ట్ ఆదినారాయణ మరణం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. ఈటీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ బాధ్యతల్లో ఉన్న ఆయనకు వర్తమాన రాజకీయాలు, ప్రజాసమస్యలపై ఎంతో అవగాహన ఉందని కొనియాడారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని.. ఇంతలో మరణవార్త వినాల్సి వచ్చిందన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆదినారాయణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ”రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పనిచేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నిబద్ధత గల జర్నలిస్ట్‌ను కోల్పోయాం. ఆదినారాయణ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని లోకేశ్ పేర్కొన్నారు.
ఆదినారాయణ మృతికి డబ్ల్యూజేఐ సంతాపం
ఈటీవీ తెలంగాణ బ్యూరో చీఫ్ ఆదినారాయణ హఠాన్మరణం అత్యంత బాధాకరమని, పాతికేళ్లుగా నిబద్ధతతో పాత్రికేయుడిగా ఆయన అందించిన సేవలు చాలా గొప్పవని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) సంతాపం ప్రకటించింది. ఆది నారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ కోరారు.