Saturday, November 23, 2024

పోల‌వ‌రం ప్రాజెక్ట్ ను గోదాట్లో ముంచేసిన జ‌గ‌న్ – చంద్ర‌బాబు విమ‌ర్శ‌

జగ్గంపేట, ప్రభన్యూస్‌ – తెలుగు ప్రజల చిరకాల వాంఛ పోలవ రం ప్రాజెక్ట్‌ ప్రస్తుత ప్రభుత్వ అసంబద్ద అవినీతి చర్యల కారణంగా గోదాట్లో కలిసిపోయిందంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విరుచుకు పడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో బుధవారం నుంచి మూడ్రోజుల పర్యట న నిమిత్తం ఆయన మధురపూడి విమానా శ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి భారీ ర్యాలీతో గోకవరం విచ్చేశారు. అక్కడ ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జగ్గంపేట వరకు స్కూటర్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల ుచోట్ల ప్రజల్నుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. దారిపొడవునా ఆయనకు ప్రజలు పెద్దెత్తున ఆహ్వానం పలికారు. మహిళలు హారతులు పట్టారు. బూరుగుపూడి వద్ద వంద గుమ్మడికాయల్తో చంద్రబాబుకు దిష్టితీశారు. గోకవరం నుంచి జక్కంపేటకొస్తుండగా రంపచోడవరానికి చెందిన కొందరు రైతులు చంద్రబాబును కలుసుకున్నారు. పోలవరం పరిహారం విషయంలో తమకు న్యాయం చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. వారినుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్ట్‌ను నాశనం చేశారన్నారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరంగా చంద్రబాబు అభివర్ణించారు. తానధికారంలోఉండగా పోలవరంపై 78సార్లు సమీక్షచేశానన్నారు. పనుల్ని పరుగులుపెట్టించానన్నారు. తన హయాంలోనే పోలవరం నిర్మాణం 72శాతం పూర్తయిందన్నారు. పోలవరం నిర్మాణం పూర్తయితే గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీరివ్వొచ్చన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ది గిపోవడంతో పోలవరం నిర్మాణానికి పలు ఆటంకాలేర్పడ్డాయన్నారు. అధికారంలోకి రాగానే జగన్‌ కాంట్రాక్టర్‌ను మార్చేశారన్నారు. వరదల కారణంగా డయాఫ్రమ్‌వాల్‌ కొట్టుకుపోయిందన్నారు. వరదల సమయంలో 16నెలల పాటు పోలవరం వద్ద కాంట్రాక్టర్‌, అధికారులు లేరన్నారు. పోలవరం ఏజెన్సీని మార్చొద్దంటూ కేంద్రం హెచ్చరించినప్పటికి జగన్‌ ఖాతరు చేయలేదన్నారు. పిపిఎ చేసిన సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్‌ ఎందుకూ కొరగాకుండా మార్చేశారన్నారు.

పరిహారం చెల్లింపులోనూ నిర్లక్ష్యం
పోలవరం నిర్వాసితులకు ఎకరానికి 19లక్షలిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన జగన్‌ అధికారంలోకొచ్చాక మాట మార్చారని చంద్రబాబు దుయ్యబెట్టారు. గతంలో పరిహారం పొందిన రైతులక్కూడా ఎకరానికి ఐదులక్షల చొప్పున ఇస్తానన్నారు. అలాగే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజ్‌ క్రింద పదిలక్షలు ప్రకటించారు. వీటిలో ఒక్కటి కూడా జగన్‌ అమలుచేయలేదన్నారు. పైగా తమ హయాంలో నిర్మించిన నిర్వాసితుల కాలనీలో కనీస వసతులు కూడా కల్పించలేదన్నారు.

ఎత్తు తగ్గింపు కుట్ర
జగన్‌ ప్రభుత్వం పోలవరాన్ని 41.5మీటర్లకే పరిమితం చేస్తామంటూ ప్రకటించడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. దీన్ని కూడా ధవళేశ్వరం తరహాలో బ్యారేజ్‌గా మారుస్తారా అంటూ నిలదీశారు. ఇప్పుడు పోలవరంపై రీసర్వే చేస్తామనడాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారు. జగన్‌కు చిన్న మెదడు చితికి పోయిందన్నారు. తన బాధంతా పోలవరం ప్రాజక్ట్‌, నిర్వాసితుల కోసం మాత్రమేనన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. ముంపు గ్రామాల్లో వరదల సమయంలో బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టలేని దైన్యస్థితిలో జగన్‌ ప్రభుత్వముందన్నారు.

ముం పు ప్రాంతాల పరిధిలో కొత్త జిల్లా ..
తామధికారంలోకిరాగానే ముంపు ప్రాంతాల పరిధిలో కొత్త జిల్లాను ఏర్పాటు చేసి అభివృద్ది పరుస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కనీసం ఒకరు చొప్పున బయటకు రావాలన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాడాలన్నారు. తన పోరాటం ప్రజల కోసమేనన్నారు. ఇందులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. దొంగపట్టాల్తో పోలవరం పరిహారం కొట్టేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. తామధికారంలోకి రాగానే దీనిపై కూడా విచారణ నిర్వహిస్తామన్నారు.

- Advertisement -

ఇంటింటికొస్తున్నారు జాగ్రత్త
గృహసారథులు పేరిట ఇప్పుడు కొందరు ఇంటింటికొస్తున్నారు. మరోసారి జగన్‌కే ఓటేయాలంటూ ఒట్లు వేయించుకుంటున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ చంద్రబాబు సూచించారు. మళ్ళీ జగన్‌కే ఓట్లేస్తే ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకోవాల్సిన పరిస్థితేర్పడుతుందన్నారు. అలాగే ఇంటికి జగన్‌ స్టిక్కర్లు వేసేందుకుప్రయత్నిస్తే సహకరించొద్దన్నారు. ప్రజలకు తాను అండగా ఉన్నానన్నారు. ఎలాంటి భయానికి లోనుకావొద్దని భరోసానిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement