అమరావతి : కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వ వైఫల్యం చెందడం వల్లే రోజు రోజుకి కేసులు, మరణాలు పెరుగుతున్నాయని ఆరోపించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో రోజుకి 12 వేలకు పైగా కొత్తగా కేసులు నమోదవుతుంటే, తప్పుడు లెక్కలు చూపుతున్నారని మండి పడ్డారు.. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుంటే, జగన్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. న్యాయస్థానాలకు సైతం కరోనా కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న వేళ రాష్ట్రంలో పాఠశాలలు తెరవడంతో వేలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్నారు. ఇప్పటికే 130 మంది ఉపాధ్యాయులు కరోనాతో మరణించారని తెలిపారు…. విద్యార్థుల కారణంగా వారి ఇంట్లో వారి ప్రాణాలకూ వైరస్ ముప్పు పొంచి ఉందని అంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? అని జగన్ ను ప్రశ్నించారు. దేశమంతా పరీక్షలు వాయిదా వేస్తే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిలదీశారు. విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇస్తారని అన్నారు…. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చామని చెబుతున్నారని అయితే ఆ ప్రభుత్వ జీవోలు ఎక్కడా అమలు కావట్లేదన్నారు. ‘రాష్ట్రంలో 3 గంటల్లో బెడ్ ఇస్తామని ప్రకటించారని, ఎక్కడైనా ఇస్తున్నారా? అంటూ జగన్ ను చంద్రబాబు నిలదీశారు. పొరుగు రాష్ట్రాలలో ఆరోగ్య శ్రీ అంటే చాలు తలుపులు మూసి వేస్తున్నారని అన్నారు. .వెంటిలేటర్ బెడ్‌కు రూ.10 వేలు వసూలు చేయాల్సి ఉంటే.. రూ.లక్షల్లో వసూలు చేస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారన్నారు. కరోనాతో ప్రజల ప్రాణాలు హరించి శ్మ శానాలకు రాజులుగా ఉండాలనుకుంటున్నారా? అంటూ మండి పడ్డారు. మిగతా రాష్ట్రాల కంటే ముందే ఏపీలో మద్యం దుకాణాలు తెరిచారని అన్నారు.. ఇక థియేటర్లు, రెస్టారెంట్లు సహా అన్నీ తెరిచి కరోనా విస్తరణకు జగన్ కారకులయ్యారంటూ ఆరోపించారు.. చివరకు మృతదేహాలను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై రాజకీయం మాని ప్రజలందరికీ ఆరోగ్య సదుపాయాలు కల్పించాలన్నారు. ఎవరైనా నీలదీసి అడిగితే కేసులు పెట్టడం కాదు ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యమని హితవు పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement