Monday, September 16, 2024

Chandra Babu – మంచి చేసేవారికి ఏపీ అడ్రస్ కావాలి – ఎపి సిఎం ఆకాంక్ష

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి – మంచి చేసేవారికి ఏపీ చిరునామా కావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మంచి చేసే వారంతా ముందుకు రావాలని కోరారు. అక్షయపాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని అన్నారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు శ‌నివారం ఉదయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. మంచి చేయాలనుకునే వారికి స్పీడ్‌బ్రేకర్లు ఉండవన్నారు. వేంకటేశ్వరస్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు.

ఆధ్యాత్మిక సేవతో మానసిక ఆనందం

హరేకృష్ణ సంస్థ దైవసేవతోపాటు మానవ సేవనూ సమానంగా చూస్తోందని చంద్రబాబు అన్నారు. ఆధ్యాత్మకత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని పేర్కొన్నారు. అందరిలోనూ దైవత్వాన్ని పెంపొందించేలా అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న 50 మంది ఐఐటీ పట్టభద్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలనూ కొనసాగించాలని కోరారు.

హరేకృష్ణకు ₹3 కోట్ల విరాళం

హరేకృష్ణ సంస్థ అన్నదానానికి ఈ సందర్భంగా చంద్రబాబు ₹ 3 కోట్ల విరాళం ప్రకటించారు. పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాస్‌రాజు కోటి రూపాయల విరాళం అందించడంతోపాటు ‘పూర్ టు రిచ్’ స్ఫూర్తితో వంద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, హరేకృష్ణ గ్రూపునకు సక్కు సంస్థ ₹కోటి, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూపు ₹కోటి చొప్పున విరాళం అందించాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement