అమరావతి, ఆంధ్రప్రభ : రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుల్లో ఒక్కోసారి తప్పులు దొర్లుతుంటాయి. సరిహద్దులు, భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, క్రయ విక్రమదారుల మధ్య జరిగిన ఒప్పంద తేదీలు వీటిలో ఎలాంటి తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం లేక అవస్థలు పడాల్సి వచ్చేది. బ్యాంకు, ఇతర తనఖా రుణాలు పొందే అవకాశం ఉండేది కాదు. ఎట్టకేలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లలో తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాచరణ చేపట్టింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 280 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. గతేడాది దాదాపు 8వేలకోట్ల రూపాయల ఆదాయం రిజిస్ట్రేష్లన్ల ద్వారా ప్రభుత్వానికి చేకూరింది. అంటే నెలకు సగటున లక్ష చొప్పున ఏడాదికి 12 లక్షల రిజిస్ట్రేషన్ల వరకు జరుగుతున్నాయి. వీటి ద్వారా రూ.8వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నట్లు అధికారుల అంచనా. రాష్ట్రంలోని ఆయా రిజిస్ట్రార్ర్ కార్యాలయాల పరిధిలో సవరణలకు ఎదురుచూస్తున్న వారు వేల సంఖ్యలోనే ఉన్నారు. అదనంగా స్టాంప్ డ్యూటీ వసూలుసాధారణంగా దస్తావేజుల్లో మార్పు చేర్పులు చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి మార్కెట్ వాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకునేవారు. అయితే ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించే విధానాన్ని మార్పు చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి తేదీ ఆధారంగా కాకుండా తాజా మార్కెట్ వాల్యూ ఆధారంగా స్టాంప్ డ్యూటీ కట్టించుకోవాలని ఆదేశించింది. దీంతో సవరణలు చేసుకునేవారి మీద అదనపు భారం తప్పదు. వ్యక్తిగత అఫిడవిట్‌తో.. రిజిస్ట్రేషన్ పత్రంలో నమోదైన తప్పుల్ని వ్యక్తిగత అఫిడవిట్‌తో సవరించుకుని కొత్త రిజిస్ట్రేషన్ పత్రం పొందవచ్చు. దొర్లిన తప్పులు, వాస్తవ వివరాలు తెలియజేస్తూ భూమి కొనుగోలుదారులే తగువిధంగా అఫిడవిట్ సమర్పిస్తే చాలు. ఆ మేరకు రిజిస్ట్రేషన్ శాఖ పరిశీలించి రిజిస్ట్రేషన్ పత్రాల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా మార్పులు చేసి కొత్త రిజిస్ట్రేషన్ పత్రాన్ని జారీ చేస్తుంది.
అవకతవకలకు అవకాశం..
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో తప్పుల్ని మార్చుకునే విధానాన్ని అవకాశంగా భావించి ఇష్టానుసారంగా సర్వే నంబర్లు మార్చేసి అవకతవకలకు పాల్పడే అవకాశాలూ లేకపోలేదు. అలా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల్లో ఉంది. దానికి సబ్ రిజిస్ట్రారే బాధ్యత వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భూవివాదాలు ఎక్కువగా ఉన్న సమయంలో వెలువడిన ఈ ఉత్తర్వులు బాధితులకు కొంత ఊరట లభించినా, అవకాశవాదులకు ఇది మార్గంగా మారింది. రిజిస్ట్రేషన్లలో జరిగిన తప్పులను సవరించుకోవడానికి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్లలో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తూ నెల కిందట ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.