Friday, November 22, 2024

భారీ వర్షాలు కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండండి

ఒంగోలు, (ప్రభ న్యూస్‌): వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ సమావేశ మందిరంలో విపత్తు నిర్వహణ క్రింద ముందస్తు చర్యలపై అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిం చిందన్నారు. ప్రభుత్వం హెచ్చరికల మేరకు ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు, తుపాను ఏర్పడితే నష్టం జరగకుండా చూడాలన్నారు.

ముందస్తుగా అంచనాలు వేసుకుంటూ తీసుకోవలసిన నివారణ చర్యలపై కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డివిజన్‌, మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయాలపై నియమించిన ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. తుపాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను గుర్తించి వాటి నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, సామాగ్రి సిద్ధం చేసుకోవాలన్నారు. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. భారీ వర్షాలకు ప్రభావితమయ్యే ప్రాంతాలను, లోతట్టు గ్రామాలను ముందుగా గుర్తించి సహాయక చర్యలపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

అల్పపీడనం తుపానుగా మారి తీరం దాటితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తదనుగుణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. తీర ప్రాంతాలైన 11 మండలాల తహశీ ల్దార్లు , నియమితులైన మండల స్పెషల్‌ ఆఫీసర్స్‌ కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ హెచ్చరించారు. ముఖ్యంగా తీర ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్దంగా ఉండాలన్నారు. భారీ వర్షాలకు ప్రభావితమయ్యే ప్రాంతాలలో త్రాగు నీరు, ఆహారము సరఫరా చేయడానికి తగిన సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదే విధంగా పునరావాస కేంద్రాలలో కూడా ఆహారము, త్రాగునీరు, విద్యుత్‌ సౌకర్యం నిరంతరం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు జె.వి. మురళి (ఆర్‌బిఅండ్‌ఆర్‌) టి.ఎస్‌. చేతన్‌ ( సచివాలయాలు మరియు అభివృద్థి), కె.ఎస్‌. విశ్వనాథన్‌ (హౌసింగ్‌) కె. కృష్ణవేణి (ఆసరా, సంక్షేమం), డి.ఆర్‌.వో. ఎస్‌. సరళావందనం, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితా సింగ్‌, ఒంగోలు ఆర్‌.డి.ఓ. ప్రభాకరరెడ్డి, మార్కాపురం ఆర్‌.డి.వో కె. లక్ష్మి శివజ్యోతి, జడ్పీ సి.ఇ.ఓ. జాలిరెడ్డి, సిపిఓ డి. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు..

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement