అనెల 31వతేదీన ఛలో సిద్ధేశ్వరంకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో మే 31న జరిగే సిద్దేశ్వరం జల జాగరణ దీక్షకు సంబంధించి కరపత్రాలను ఆయన విడుదల చేసారు. అనంతరం దశరథరామిరెడ్డి మాట్లాడుతూ… పాలకుల నిర్లక్ష్యంతో, ప్రతిపక్ష పార్టీల నిరాదరణతో వెనుక పడవేయబడిన రాయలసీమ సమాజం, సిద్దేశ్వరం ఉద్యమ స్ఫూర్తితో గొంతు సవరించుకుంటూ అనేక హక్కుల సాధన దిశగా గత ఏడు సంవత్సరాలుగా ముందుకు నడుస్తున్నదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఉద్యమ చరిత్రలో మే 31, 2016 న నిర్వహించిన సిద్దేశ్వరం అలుగు సాధన ఉద్యమం చారిత్రాత్మకమైనదని, ఏ రాజకీయ పార్టీ అండ దండ లేకుండా 30 వేల మందికి పైగా రాయలసీమ ప్రజానీకం స్వచ్ఛందంగా, తమ వాహనాలతో, తమ ఆహారంతో, తమ నీటితో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన అన్నారు. ఈ సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన కార్యక్రమం రాయలసీమలో ఉద్యమ స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.
అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధించడంలో ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలది అత్యంత కీలకమైన పాత్ర అనీ, కానీ ఎందుకో ఏ భావజాలానికి లోనయ్యో, ఏ శక్తులకు వశమయ్యో రాజకీయ పార్టీలన్నీ రాయలసీమ అంశాలను తమ అజెండాగా చేర్చుకోవడానికి వెనకంజ వేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన అంశాలను కూడా రాజకీయ పార్టీలు తమ అజెండాలో చేర్చుకునేలాగా ఒత్తిడి పెంచే కార్యక్రమాలతో యావత్తు రాయలసీమ సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా అడుగులు వేస్తూనే మనకు స్ఫూర్తినిచ్చిన సిద్దేశ్వరం ప్రజా శంకుస్థాపన ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించి రాజకీయ పార్టీలన్నీ సహకరించేలాగా ఒత్తిడి పెంచుదామని ఆయన అన్నారు. అనేక పాలన అనుమతులను సాధించినా, వాటి అమలు దిశగా రాయలసీమ సమాజం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా మే 31 న సిద్దేశ్వరం జల జాగరణ దీక్ష ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 31న సాయంత్రం 6 గంటల నుండి జూన్ 1 ఉదయం 10 గంటల వరకు సంగమేశ్వరం, కొత్తపల్లి మండలం, నంద్యాల జిల్లాలో చేస్తున్న సిద్దేశ్వరం జల జాగరణ దీక్షలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నామని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, కార్యదర్శి మహేశ్వర రెడ్డి, కొమ్మా శ్రీహరి,మనోజ్ కుమార్ రెడ్డి, పట్నం రాముడు, క్రిష్ణమోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, నిట్టూరు సుధాకర్ రావు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.