తాడిపత్రి టౌన్ (ప్రభన్యూస్): అనంతపురం జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ట్యూషన్ నుంచి వస్తున్న ఓ విద్యార్థి నుంచి బంగారు చైన్ కొట్టేసిన ఘటన అనంతపురంలో ఇవ్వాల (సోమవారం) రాత్రి జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని మన్విత అనే విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఆమె మెడలో ఉన్న గొలుసును చాకచక్యంగా కొట్టేశాడో దొంగ. కాగా, మన్విత ఆరో తరగతి చదువుతోంది, స్కూల్ తర్వాత సాయంత్రం 6గంటల నుండి 8వరకు జయనగర్ లో ఉన్న కోచింగ్ సెంటర్‌కు వెళుతుంది.
ఈ క్రమంలో రాత్రి 8:30 సమయంలో ట్యూషన్ నుండి ఇంటికి వస్తుండగా సైకిల్ పంచరయ్యింది. అయితే.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించి, పాప మీ నాన్న చెప్పాడు.. నీ మెడలో గొలుసు తీసుకొని బ్యాగులో పెట్టుకో అంటూ మాయమాటలు చెప్పాడు. ఆ మాటలతో భయపడ్డ విద్యార్థిని మెడలోని బంగారు గొలుసు తీసుకొని స్కూల్ బ్యాగులో వేసి జిప్పు పెట్టింది. మళ్లీ ఒకసారి చూసుకో అమ్మ ఉందో లేదో అని చెప్పడంతో చెక్ చేస్తుండగానే అతను బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీంతో ఆ బాలిక భయంతో ట్యూషన్ సెంటర్‌కు వెళ్లి విషయం తెలియజేసింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.