Friday, November 22, 2024

నూతన ప్రాజెక్టులతో ముందుకు వస్తున్న కేంద్ర ప్రభుత్వం

నెల్లూరు, ప్రభ న్యూస్‌ :ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ప్రధాన రహదారుల నిర్వహణను చేతికి తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం జాతీయ అభివృద్ధిలో భాగంగా పలు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. నెల్లూరు జిల్లా నుంచి చెన్నైకు మరో జాతీయ రహదారి ఏర్పాటుతో పాటు నెల్లూరు – బెంగళూరు ప్రధాన రహదారిని ఆరు లైన్లుగా అభివృద్ధి చేయడం, నెల్లూరు – విజయవాడను కూడా మరింత సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు, రాయలసీమకు సంబంధించి నెల్లూరు – కడప జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు మరిన్ని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ పథకాలు అమలు ప్రారంభం కావడంతో పలు చోట్ల రహదారులు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అనంతపురం – చిత్తూరు – బెంగళూరు – నెల్లూరు రహదారి పనులు ఇప్పటికే జరుగుతున్నాయి. కడప జాతీయ రహదారి అభివృద్ధి జరిగింది. మరింత అభివృద్ధి చేసేందుకు నూతన పథకాలు సిద్ధమవుతున్నాయి. దేశంలో కృష్ణపట్నం ఓడరేవు అటు ఎగుమతుల్లోనూ.. ఆటు దిగుమతుల్లోనూ రోజురోజుకూ అభివృద్ధి సాధిస్తుండడంతో మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు రహదారి అభివృద్ధి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా కృష్ణపట్నం బేస్‌గా చెన్నై , బెంగళూరు , విజయవాడ , కలకత్తా జాతీయ రహదారులు మరింత అభివృద్ధి కానున్నాయి. వీటిలో భూసేకరణ కీలకంగా మారింది.

తిరుపతి – నెల్లూరు మధ్య ప్రాంతమే కీలకం

నెల్లూరు – చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇందులో భాగంగా కృష్ణపట్నప్రపాంతం నుంచి వరుసగా ఇటు తడ మీదుగా చెన్నై వరకు రేణిగుంట , తిరుపతి మీదుగా బెంగళూరు వరకు భవిష్యత్తులో అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఈ కారిడార్‌ అభివృద్ధిలో కృష్ణపట్నం పోర్టుతో పాటు రేణిగుంట ఎయిర్‌పోర్టు మరింత కీలకం కానున్నాయి. వీటన్నింటిని అనుసంధానం చేసే క్రమంలో భాగంగా జాతీయ రహదారుల అభివృద్ధి పథకాలు అమలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు – తిరుపతి మధ్య ప్రాంతం మరింత కీలకంగా మారనుంది. నాయుడుపేట ప్రధాన కేంద్రంగా మరింత అభివృద్ధి చెందనుంది. ఈ నేపథ్యంలో శరవేగంగా జరుగుతున్న భూసేకరణను న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతుండడందో రహదారి విస్తరణ పనుల్లో జాప్యం కలుగుతుండడమే కాకుండా ముఖ్యంగా నాయుడుపేట , తిరుపతిల మధ్యలో వాహనాల రద్దీ కారణంగా నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భూసేకరణ సమస్యలు తొలగి ఆ రహదారి కూడా మరింత అభివృద్ధి చెందితే ప్రమాదాల సంఖ్య కూడా తగ్గనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement