న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తమది సముచిత నిర్ణయమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని, వారికి నష్టపరిహారం సహా అన్ని సౌకర్యాలు కల్పించామని ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో విశాఖ స్టీల్ పెట్టుబడుల ఉపసంహరణపై ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిజిన్విస్ట్‌మెంట్ సరైన నిర్ణయమన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కంపెనీలు బాగుపడ్డట్టు 2019-20 ఆర్థిక సర్వే వెల్లడించిందని, పెట్టుబడుల ఉపసంహరణ అంశాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి నొక్కి చెప్పారు. క్యాప్టివ్ మైన్స్ లేకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ గతంలో లాభాలు ఆర్జించిందని తెలిపారు.
ఉత్పాదకత తగ్గిపోయిందని, కెపాసిటి యుటిలైజేషన్ తగ్గిపోయిందని, విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణ వల్ల అప్పులు పెరిగిపోయి ఏడు వేల కోట్ల నష్టాలు వచ్చాయని రామచంద్ర ప్రసాద్ సింగ్ వివరించారు. అందుకే పెట్టబడుల ఉపసంహరణ తప్పదని, దీనివల్ల ప్లాంట్ అభివృద్ధి జరుగుతుందని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి సమాధానాన్ని తాము అంగీకరించట్లేదని వైఎస్సార్సీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. సొంత గనులు లేకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఎక్కువ శాతం వడ్డీలకు అప్పులు చేశారని అన్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని గుర్తు చేసిన భరత్… ఎట్టిపరిస్థితుల్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఒప్పుకోమని స్పష్టం చేశారు. పెట్టుబడుల ఉపసంహరణపై పునః పరిశీలన చేయాలని కేంద్రాన్ని కోరారు.