Thursday, November 21, 2024

రాష్ట్రాలను లూటీ చేస్తున్న కేంద్రం, ద్రవ్యోల్బణం నియంత్రణలో విఫలం.. రాజ్య‌స‌భ‌లో విజయసాయి ఫైర్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ద్రవ్యోల్బణం నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శిచారు. ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆయన మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాల్సిన బాధ్యత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఉంది.  ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అటు ప్రభుత్వం ఇటు  ఆర్బీఐ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ద్రవ్యోల్బణం 6 శాతం పైబడే ఉంటుందని ఆర్బీఐ ప్రకటించడం గమనార్హమని అన్నారు. పరాయి దేశాల్లో ద్రవ్యోల్బణం రేటుతో  పోల్చుకొని మనం  మెరుగైన స్థితిలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదన్నారు.

ద్రవ్యోల్బణం అనేది చట్టబద్దత లేని పన్నులు వడ్డింపు వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈరకమైన వడ్డింపులు రాజ్యంగంలోని ఆర్టికల్ 38ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల మధ్య ఆర్థిక అసమానతలు రూపుమాపి, సామాజిక అంతరాలు తొలగించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కానీ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విజయసాయిరెడ్డి అన్నారు. కొందరు సభ్యులు పేర్కొన్నట్లు హోల్ సేల్ ధర సూచికతో పోలుస్తూ ద్రవ్యోల్బణం 15.1శాతం ఉందని చెప్పడం సరికాదు, కొనుగోలు ధర సూచికతో పోల్చడమే సరైన పద్దతి. ఆవిధంగా చూస్తే ప్రస్తుతం ద్రవ్యోల్బణం 7.1 % మాత్రమే ఉంది. యూపీఏ హయాంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ద్రవ్యోల్బణం 10.4శాతం ఉందని ఆయన గుర్తు చేశారు.  

ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల సమాన్యుడిపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, 2000 సంవత్సరంలో 1 లక్ష రూపాయలు ప్రస్తుతం 27 వేలకు సమానమని విజయసాయిరెడ్డి అన్నారు. ఆ మేరకు తగిన  చర్యలు చేపట్టి ధరల పెరుగుదలను అదుపు చేయాలని ఆయన సూచించారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం (సెంట్రల్ గ్రాస్ టాక్స్ రెవెన్యూ)లో ఆంధ్రప్రదేశ్‌కు నిర్ణయించిన వాటా మేరకు కేంద్రం చెల్లించనందున గడిచిన ఏడేళ్ళలో రాష్ట్రం 46 వేల కోట్లు నష్టపోయిందని  విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పన్నుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి 11 లక్షల 26 వేల కోట్లు నష్టపోయాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినట్లు సెంట్రల్ గ్రాస్ టాక్స్ రెవెన్యూలో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వడం లేదని, కేవలం 31 నుంచి 32 శాతం వాటా మాత్రమే చెల్లిస్తోందని తెలిపారు. సెస్, సర్‌ చార్జీలను ఎడాపెడా విధిస్తూ కేంద్రం రాష్ట్రాలను లూటీ చేస్తోందని విజయసాయి విమర్శించారు.

వలస కూలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
కోవిడ్ మహమ్మారి కారణంగా వలస కూలీలు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారని, వారికి ఉపాధి కల్పించడం ఉద్యోగ భద్రత ఇవ్వడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచవచ్చు. 2022 జనవరి- మార్చి మధ్యలో 47.3శాతంగా ఉన్న లేబర్ భాగస్వామ్యం  ఒక్క మార్చి నెలలోనే 39.5శాతానికి పడిపోయింది. 3.8 లక్షల మంది శ్రామికులు ఉపాధి కోల్పోయారు. ఆయిల్, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గత 7 ఏళ్ళలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధరలను నమోదు చేశాయని అన్నారు. అదే సమయంలో దేశీయంగా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని అన్నారు. చిన్న పొదుపు స్కీములపై వడ్డీ రేట్లు పెంచాలి. కేంద్ర ప్రభుత్వ 10 సంవత్సరాల బాండ్లపై వడ్డీ రేట్లు 6.4శాతం నుంచి 7.46శాతానికి పెంచినట్లుగానే చిన్న పొదుపు స్కీములు, పీపీఎఫ్, సుకన్య సమృద్ది యోజన, వయోవృద్ధులు పొదుపు పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచడం ద్వారా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు చేయూతనిచ్చినట్లు అవుతుందని, అదే సమయంలో నగదు లభ్యత పెరుగుతుందని సూచించారు.

ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే రుణాలు
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలు మంజూరు చేసే విషయంలో బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను విధిగా పాటించాల్సిందేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ బ్యాంకులు ఎవరికైనా రుణం మంజూరు చేయాలన్నది వ్యాపారపరమైన నిర్ణయమన్నారు. అయితే రుణాల మంజూరు ప్రక్రియలో బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించి తీరాలని, ఈ నియమ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మినహాయింపు ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు మంజూరు చేసే రుణాల విషయంలో బ్యాంకులకు పొంచివున్న రిస్క్‌లను ఆర్బీఐ పర్యవేక్షిస్తూ మదింపు చేస్తుందని మంత్రి వివరించారు.

- Advertisement -

రుణాల మంజూరు విషయంలో వ్యాపారపరమైన సాధ్యాసాధ్యాలను, రుణా బకాయిల చెల్లింపునకు తగిన ఆదాయ వనరుల లభ్యత, నిధులను నిర్దేశించిన అవసరాలకు వినియోగిస్తున్నవా లేదా అన్న అంశాలను లోతుగా విశ్లేషించకుండానే గతంలో కొన్ని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు రుణాలను మంజూరు చేసిన ఉదంతాలు రిజర్వ్‌ బ్యాంక్‌ దృష్టికి వచ్చాయని మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవలప్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌డీసీ) మరే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌కు బ్యాంకులు మంజూరు చేసే రుణ లేదా వడ్డీకి సంబంధించిన చెల్లింపులు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి జరగుతున్న సంఘటనలు తమ మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్రం ఎంత మేరకు రుణాలను సేకరించుకోవచ్చో కేంద్రం నిర్దేశిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌ ద్వారా సేకరించే రుణాలను సీలింగ్‌కు లోబడి తీసుకునే రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే పరిగణించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement