Friday, November 22, 2024

Delhi | హజ్ యాత్రికుల సమస్యలపై కేంద్రం సానుకూలం.. స్మృతి ఇరానీతో అంజద్ బాషా భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ వెళ్లే యాత్రికుల సమస్యలపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖా మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజం, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇబాదుల్లా, ఎస్. ఖాదర్, షేక్ మహ్మద్ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఒక ఎంబర్కేషన్ పాయింట్ కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరగా కేంద్ మంత్రి సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.

హైదరాబాద్ లేదా బెంగళూరు ఎంబర్కేషన్ పాయింట్లతో పోలిస్తే విజయవాడ ఎబార్కేషన్ పాయింట్ నుంచి హజ్‌కు వెళ్ళే హాజీలకు రూ.83,000 అధికంగా ఖర్చవుతోందని, ధర తగ్గింపు విషయాన్ని పరిశీలించవలసినదిగా కేంద్రమంత్రిని కోరామన్నారు. ధర తగ్గించడం కుదరని పక్షంలో ఏపీ హాజీలు హైదరాబాదు లేదా బెంగళూరు ఎంబర్కేషన్ పాయింట్ల నుంచి వెళ్ళే సదుపాయం కల్పించమని విజ్ఞప్తి చేశామని ఆయన చెప్పారు. విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ కొత్తది కావడం వల్ల టెండర్లలో విమానయాన సంస్థలు ధర అధికంగా కోట్ చేయడం వల్ల ఛార్జీలు పెరిగాయని స్మృతి ఇరానీ తమకు వివరించారని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

తమ అభ్యర్థనలపై ఆమె సానుకూలంగా స్పందించారని, ఈ అంశంపై పౌర విమానయాన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో మాట్లాడతామన్నారని హామీ ఇచ్చారన్నారు. జూన్ 7 నుంచి జూన్ 21 వరకు ప్రతిరోజు 120 మంది హజీలతో ఒక విమానం విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ నుంచి సౌదీ వెళ్లనుందని తెలిపారు. ఏపీ హాజీలు ధర అధికంగా చెల్లించాల్సిన పక్షంలో ఆ వ్యాయభారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంతోషంగా భరిస్తుందని అంజద్ బాషా ప్రకటించారు. హాజీలకు ట్రైనింగ్ క్యాంప్‌లు నిర్వహిస్తామని, విడిది ఏర్పాట్లు చేసి హజ్‌కు పంపిస్తామని ఆయన తెలిపారు.

అనంతరం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మతపెద్దలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ హజ్ కమిటీ ఛైర్మన్ గౌస్ లాజం మాట్లాడుతూ… హాజీల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం వరకూ తీసుకొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. తమకు అన్ని విషయాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement