న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్ర విజభన చట్టంలోని నిబంధనల ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 3 రాజధానుల అంశానికి సంబంధిం చి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిష న్ ఈనెల 23వ తేదీన విచారణకు రానుంది. అంతకు ముందు ఈ వ్యవహారంపై కౌంటరు దాఖలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తరపున అండర్ సెక్రటరీ శ్యాముల్ కుమార్ బిట్ ప్రమాణ పత్రం దాఖలు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5, 6 రాజధానికి సంబంధించినవని చెప్తూ ఈ ప్రకారం హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పదేళ్లు కొనసాగించాల్సి ఉందని ఇందులో సెక్షన్ 6ని అనుసరించి కొత్త రాజధాని ఏర్పాటుకు రి-టైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటిని నియమించామని కేంద్రం వివరించింది.
ఈ కమిటి నివేదికలో పొందు పరిచిన సూచనలు, సలహాలను క్రోఢీకరించి అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 23న నోటిఫై చేసిందని కౌంటర్ అఫిడవిట్‌లో కేంద్ర హోం శాఖ గుర్తుచేసింది. ఇందుకు అనుగుణంగా.. రాజధాని ప్రాదేశిక ప్రాంత అభివృద్ధి చట్టం- (ఏపీసీఆర్‌డీఏ)ను ఇచ్చారు. విభజన చట్టంలోని సెక్షన్ 5, 6లతో రాజధాని అంశాన్ని ముడిపెట్టినట్లుగా మంత్రి సమాధానం ఉండటం ఇప్పుడు రైతులకు కాస్త ఊరటనిచ్చినట్లుగా అయింది. మరోవైపు మూడు రాజధానుల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేస్తున్న తరుణంలో కేంద్రం చేసిన ప్రకటన కొంత ఉత్కంఠతకు దారి తీసింది. మంత్రి ఇచ్చిన సమాధానంలోనే మూడు రాజధానుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని చెప్పడంతో పాటు ఆ చట్టాలతో అమరావతికి సంబంధం లేదని పేర్కొనడం 2015లోనే రాజధాని నిర్ణయం జరిగిపోయిందని తెలపడం కొత్త ఆశలకు కారణమైంది. అయితే గతంలోనే రాజధాని ఏర్పాటుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిం దని ఆ నివేదికను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింద ని తేల్చి చెప్పారు.
మూడు రాజధానుల బిల్లును 2020లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ బిల్లు పెట్టే అంశాన్ని తమదృష్టికి తీసుకురాలేదని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇలా కేంద్రం చెప్పకనే చెబుతూ చేసిన ప్రకటనతో రైతులు తమ పోరాటం వృథా కాలేదన్న సంతోషంలో ఉన్నారు. మరోవైపు అన్ని విషయాలను పూర్తిస్థాయిలో తాజాగా వెల్లడించిన కేంద్రం ఇదే సమయంలో ఈ వ్యవహారమంతా కోర్టుల పరిదిలో ఉందని దీనిపై మాట్లాడలేమని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కేంద్రం చేసిన ప్రకటన సానుకూలంగా ఉన్నట్లు రైతులు, మహిళలు భావిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందోనన్న టెన్షన్ కూడా ఆ ప్రాంత రైతుల్లో ఉంది. అయితే కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి ఉన్నట్లుగా తాజా ప్రకటన కనిపిస్తుందని రైతులు, ఉద్యమకారులు చెబుతున్నారు. హైకోర్ట్ తీర్పు ఇప్పటికే తమకు అనుకూలంగా ఉందని ఇదే విధంగా సుప్రీంతీర్పు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా రైతులు, మహిళలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కూడా అమరావతి అంశంపై తాడోపేడో తేల్చుకోవడానికి పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని కోరింది. ఈ నేపథ్యంలో అమరావతిపై త్వరలోనే పూర్తిస్పష్టత వచ్చే అవకశాలు కనిపిస్తున్నాయి.
కొనసాగుతున్న పోరాటం
ఇదిలా ఉంటే అమరావతి రైతులు, మహిళల పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. గడిచిన 1149 రోజులుగా అమరావతి ప్రాంతంలో రైతులు, దీక్షలు కొనసాగిస్తున్నారు. బిల్డ్ అమరావతి.. సేవ్ ఏపీ పేరిట ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అమరావతి పరిధిలోని 26 గ్రామాల్లో రైతులు, మహిళలు దీక్షా శిబిరాల్లో యధావిధిగా తమ నిరసన తెలుపుతున్నారు.