తిరుపతి సిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రూ.1453 కోట్లు చెల్లించటానికి కేంద్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ సానుకూలంగా స్పందించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి బుడి ముత్యాల నాయుడు తెలిపారు. కేంద్ర మంత్రి తిరుమల తిరుపతి పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిధి గృహంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు చిత్తూరు – రెడ్డప్ప, తిరుపతి డా.గురుమూర్తి , అనకాపల్లి – సత్యవతి జెసి డీకే బాలాజీ, రాష్ట్ర డైరెక్టర్ చిన్న తాతయ్య, జిల్లా అధికారులు కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీడియాకు వివరిస్తూ కేంద్ర మంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా వారికి స్వాగతం పలికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు కేంద్రం నుండి రావలసిన బకాయిలను, కేంద్ర అనుసంధాన పథకాలలో పేదలకు కొన్ని వెసులుబాటు కోసం వినతి పత్రం అందించామని వివరించారు.
పండ్ల తోటల రైతులకు 5 ఎకరాల వరకే వెసులుబాటు ఉందని 10 ఎకరాలు ఉన్న వారిని పెద్ద రైతులుగా గుర్తిస్తున్నామని అయినా వాళ్ళు పంటలు పండక పేద రైతులు గానే ఉండిపోతున్నారని పరిశీలించి 10 ఎకరాలకు అర్హత కలిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరామని అన్నారు. గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ తోటలకు కూడా ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయాలని అప్పుడే గిరిజనులకు మేలు కలుగుతుందని తెలిపామని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద గృహ నిర్మాణాలకు ఇస్తున్న 90 రోజులు పని దినాలను 100 రోజుల పని దినాలతో కలపకుండా అదనంగా ఉపాధి కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఎస్టీలలో అత్యంత వెనుకబడిన వారు చెంచు జాతులని వారికి ఉపాధి హామీ పనులు 200 రోజులు వర్తించేలా కోరామని తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేస్ 1 కింద పనులను రానున్న మార్చి వరకు పొడిగించాలని దాదాపు 624 కిలోమీటర్లు రోడ్లు వేయవలసి ఉందని సూచించామని అన్నారు. ఫేస్ III కింద 970 కిలోమీటర్లు 76 బ్రిడ్జిల నిర్మాణాలకి ప్రతిపాదనలు పంపేమని మంజూరు చేయాలని కోరమని తెలిపారు. నేషనల్ రూర్బన్ మిషన్ కింద రూ. 48 కోట్లు వెనక్కు తీసుకోవడంతో రూ. 145 కోట్లు చెల్లింపులు ఆగాయని త్వరగా మంజూరు చేయాలని కోరమని అన్నారు. దీన దయాల్ అంత్య యోజన -జాతీయ గ్రామీణ ఉపాధుల మిషన్ శిక్షణ నిచ్చే ఏజెన్సీలకు రూ.5.81 కోట్లు కేంద్రం నుండి రావాల్సి ఉందని వెంటనే విడుదల చేయాలని, పేదలకు అందించే ఈ శిక్షణలు ఎంతో అవసరమని తెలిపామని అన్నారు.