విజయనగరం, నవంబరు 16(ప్రభ న్యూస్) :
వివిధ సామాజిక వర్గాల జనాభాను తెలుసుకొనే లక్ష్యంతో ఈనెల 27 నుంచి జిల్లాలో వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా కులగణన సర్వే జరుగుతుందని, దీనికి యంత్రాంగం సిద్దం కావాలని ఆదేశించారు. కుల గణన-2023పై టెలీకాన్ఫరెన్స్ ద్వారా గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకోవడం కోసం కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను రూపొందించడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఈ సర్వే వివరాలు దోహదపడతాయని పేర్కొన్నారు. బలహీన, వెనుకబడిన వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు. కులగణన గురించి ముందుగానే వలంటీర్ల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించి, అపోహలను తొలగించాలని సూచించారు. సర్వేలో కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలనే నమోదు చేయాలని, వాటికి సంబంధించిన ధృవప్రతాలను అడగనవసరం లేదని స్పష్టం చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి, ఎవరి కులం వారికే నమోదు చేయాలన్నారు. ఎవరైనా కులం పేరు చెప్పడానికి ఇష్టపడకపోతే, వారిని బలవంతం చేయవద్దని, ఇది స్వచ్ఛందమేనని స్పష్టం చేశారు. సేకరించిన సమాచారం ప్రభుత్వం వద్ద భద్రంగా ఉంటుందని, దీనిని ఏ ప్రయివేటు సంస్థకు, వ్యక్తులకు వెళ్లడించడం జరగదని చెప్పారు. కుల గణనలో భాగంగా నవంబర్ 27 నుండి వారం రోజుల పాటు మొబైల్ యాప్ ద్వారా డోర్ టూ డోర్ సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖ, ప్లానింగ్, సంక్షేమ శాఖల నుండి ఎంపిక చేసిన సూపర్వైజర్ లు ఈ సర్వేను పర్యవేక్షిస్తారన్నారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్లి కులగణన చేస్తారని తెలిపారు. ముందుగానే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి కులగణన గురించి వివరించాలని సూచించారు. మండల స్థాయిలో తాశిల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, మండల ప్రత్యేకాధికారులు ఈ సర్వేని పర్యవేక్షిస్తారని తెలిపారు. వివరాలను నమోదు చేయడం కోసం ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి రానుందన్నారు. కులగణన కోసం గ్రామ, మండల స్థాయి తోపాటు, జిల్లా స్థాయిలోకూడా ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ కుల సంఘాలు, ఎస్సి, ఎస్టి, బిసి సంఘాలను పిలిచి కులగణన గురించి వివరించాలని సూచించారు. ప్రతీ వ్యక్తి వివరాలు నమోదు చేసినప్పుడు వారి ఇకెవైసి తప్పనిసరిగా చేస్తారని. వయసు 8 సంవత్సరాల లోపు ఉన్న వారికి ఇకెవైసి తప్పనిసరి కాదని తెలిపారు. ప్రతీ కుటుంబానికి సర్వే పూర్తి చేసిన తర్వాత సచివాలయం సిబ్బంది మరియు వాలంటీర్ బయోమెట్రిక్ వేసి వివరాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జెడ్పి సిఇఓ కె.రాజ్‌కుమార్, సిపిఓ పి.బాలాజీ, డిపిఓ నిర్మలాదేవి, ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, తాశిల్దార్లు పాల్గొన్నారు.