Saturday, January 4, 2025

Celebrations – పర్యాటకుల‌తో ఏజేన్సీ కిట‌కిట‌ – వేడుకల కోసం ముందే వచ్చిన జనం

చింతూరు, వీఆర్‌ పురం, మారేడుమిల్లి ప్రాంతాల్లో సందడి
మన్యంలోని రిసార్ట్‌లకు పుల్‌ గిరాకీ
రంపచోడవరం ఏజేన్సీలో రచ రచ్చ
జనవరి 5వరకు రెస్టారెంట్లలో ఖాళీల్లేవ్​

పచ్చదనం పరిచిన ప్రకృతి సోయగాలు.. పక్షుల కిలకిలరావాలు.. ఎత్తునుంచి జాలువారే జలపాతాలు.. ఇవన్నీ మన్యంలోని ప్రత్యేకతలు.. అయితే.. వీటిని చూసి తరించేందుకు ప్రకృతి ప్రేమికులు నిత్యం తరలివస్తుంటారు. ఇక.. ఈ ఏడాదిని సంబురంగా ముగించి.. న్యూ ఇయర్​ 2025ని ఘనంగా ఆహ్వానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. కొండ కోనల్లోని సోయాగాలను అస్వాదిస్తూ.. జలపాతంలో జలకాలాడుతూ, మారేడుమిల్లి మన్యంలోని గుడెసా వంటి ఎత్తౖనా ప్రదేశంలో గడపడానికి చాలామంది తరలివస్తున్నారు. పాపికొండల విహారయాత్రతో పరవశించిపోతున్నారు. ప్రకృతి సహజ సిద్దంగా ఏర్పడిన పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టులు సందడి పెరిగింది. ఈసారి న్యూ ఇయర్‌ వేడుకలకు మన్యం వేదికగా మారింది.

ఆంధ్రప్రభ స్మార్ట్​, చింతూరు : అల్లూరి జిల్లాకు జనం క్యూ కట్టారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లోని అటవీ అందాలను చూసి తరించేందుకు తరలివస్తున్నారు. మన్యంలోని ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చేవారితో తాకిడి పెరిగింది. 2024కు వీడ్కోలు పలుకుతూ.. 2025కు స్వాగతం పలికేందుకు ప్రకృతి ప్రేమికులు మన్యం ప్రాంతాన్ని వేదికగా చేసుకుంటున్నారు. నూతన సంవత్సర వేడుకలను మన్యంలో జరుపుకునేందకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుండడంతో చింతూరు, వీఆర్‌ పురం, మారేడుమిల్లి మండలాలు పర్యాటకులతో సందడిగా మారాయి.

- Advertisement -

న్యూ ఇయర్‌ వేడుకలకు వేదిక..

రంపచోడవరం పరిధిలోని చింతూరు, వీఆర్‌ పురం, మారేడుమిల్లి మన్యం మండలాలు న్యూ ఇయర్‌ వేడుకులకు వేదికగా మారాయి. చింతూరు మండలంలోని మోతూగూడెం పంచాయతీ పరిధిలోని పోల్లూరు జలపాతం పర్యాటకులతో అలరారుతోంది. జలపాతాన్ని చూసేందకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి జనం బారులు తీరారు. వీఆర్‌ పురం మండలంలోని పాపికొండల బోట్‌ విహారయాత్రకూ పర్యాటకుల తాకిడి పెరిగింది. విహారయాత్రతో పాటు నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందకు జనం బారులు తీరారు. పర్యాటకుల రాకతో గోదావరిలో జల విహారం సందడిగా మారింది.

మారేడుమిల్లి కిట‌కిట …

రాజమండ్రి ఘాట్‌లో మారేడుమిల్లి మండలంలోని ప్రకృతి అందాలలో పర్యాటకులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు . మారేడుమిల్లి మండల కేంద్రం మొత్తం పర్యాటకుల వాహనాలతో నిండిపోయింది. మారేడుమిల్లి ఘాట్‌ రహదారిలో జల తరంగణీ, జంగిల్‌స్టార్‌, అమృతదార, మన్యం వ్యూ పాయింట్ల వద్ద పర్యాటకులు ప్రశాంత వాతవరణంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందకు చేరుకున్నారు. మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంలో అత్యంత పేరుగాంచిన గుడిసా, దుంపవలస జలపాతానికి జనం తాకిడి పెరిగింది. ఈ మూడు మండలాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకునేందకు వేలాదిమంది తరలివచ్చారు.

రిసార్ట్‌లకు పుల్‌ గిరాకీ..

టూరిస్టుల రాకతో మన్యంలో రిసార్ట్‌లకు గిరాకీ పెరిగింది. చింతూరు మొదలుకొని రంపచోడవరం వరకు ఉన్న ఏ ఒక్క రిసార్ట్‌ ఖాళీ లేదు. మోతుగూడెం, మారేడుమిల్లి, రంపచోడవరంలో ఉన్న రిసార్టులు, హోటల్స్‌, కాటేజీలు, క్యాంపెయన్‌ ప్రదేశాలు ముందస్తుగా బుక్​ అయ్యాయి. మూడు రోజుల నుండే ఈ రిసార్ట్‌ ఖాళీ లేకుండాపోయాయి. జనవరి 5వ తేదీ వరకు ఏ ఒక్క రూమ్​, హోటల్‌, రిసార్ట్‌, కాటేజీలు చిట్ట చివరికి క్యాంపెయన్‌ టెంట్స్‌ సైతం ఖాళీ లేకుండా బుక్​ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement