అమరావతి, ఆంధ్ర ప్రభ:లాకప్‌డెత్‌లు.. ధర్డ్ డిగ్రీ ప్రయోగాలు.. కస్టడీలో ఆత్మహత్యలు.. అనధికారిక నిర్భంధాలు.. అవినీతి అక్రమా లు.. ప్రైవేటు పంచాయితీలు.. లాఠీ కోటింగ్ లు.. పోలీసు స్టేషన్ అంటే గుర్తుకు వచ్చేవి ఇవే. రెండు దశాబ్దాల క్రితం పోలీసింగ్ వేరు.. అంతా మాన్యువ ల్గా నడిచేది.. ఠాణాలు యమలోకాలు అనే నానుడి నుంచి క్రమంగా ‘ఫ్రెండ్లీ పోలీసు’కు చేరుకున్నాం.. అయినా కొన్ని సందర్భాల్లో నేటికీ ఆ పాతకాలపు పోలీసు ట్రీట్మెంట్ వాసన పోవడం లేదు. ఆధునిక పోలీసింగ్‌లో పారదర్శకత లోపిస్తున్నం దున పోలీసు స్టేషన్ లలో అసలు ఏం జరుగుతుందనే ప్రశ్న ఉత్పన్న మవుతోంది. పోలీసుల అదుపులో అనుమానితులు, నిందితులు, అమాయకులు అనేక సందర్భాల్లో తీవ్ర హింస కు గ ురవుతున్నారు. వివిధ సందర్భాల్లో బలవుతున్నారు కూడా. ఇది దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో నెలకొన్న పరిస్ధితి. అందుకే దేశ అత్యున్నత న్యాయస్ధానం సుప్రీం కోర్టు ఇటీవలే మరోసారి తీవ్ర స్ధాయిలో స్పం దించింది. పోలీసు స్టేషన్లలో ఏం జరుగుతుందనే దానిపై ఉన్నతా ధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలంటూ ఆదేశించింది. ఇందు కోసం సీసీ కెమేరాలు తక్షణమే ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
దీనిలో భాగంగా మన రాష్ట్రంలో రెండోవిడత పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభమైంది. నిజానికి సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు 2020లోనే ఆదేశించింది. కాని కార్యరూపం దాల్చలేదు.
పోలీసు ఇలాకాలో మూడో నేత్రం పని చేయడం ఇష్టం లేని పోలీసు యంత్రాంగం తన విముఖతను ప్రదర్శించింది. అయినా తప్పదన్నట్లు రాష్ట్రంలో కొన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా ముగించారు. డీజీపీ కార్యాలయం, జిల్లా ఎస్పీల పర్యవేక్షణ లేకపోవడంతో అవి కాస్తా మరుగునపడ్డాయి. ఇక ఇటీవల కాలంలో పోలీసు స్టేషన్లలో లాకప్ మరణాలు, ధర్డ్ డిగ్రీలు, అరాచకాలు పెరిగిపోయిన క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయ కపోవడంపై ప్రశ్నించింది. ఇక తప్పనిసరి పరిస్ధితుల్లో రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగం ముందుకు కదిలింది. ఈమేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో డీజీపీ కార్యాలయం నుంచి కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, విజయవాడ, విశాఖ పోలీసు కమిషన రేట్లకు ఆదేశాలు అందాయి. పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై సుప్రీం కోర్టు మార్గదర్శ కాలు ఉన్నాయి. లాకప్ గది, రిసెప్షన్, స్టేషన్ హౌసాఫీర్ గది, ఇంకా రైటర్, విజిటర్స్ గది, ఎస్ఐల గదులు, స్టేషన్ ప్రాంగణం, ముఖ ద్వారం తదితర చోట్ల అమర్చాల్సి ఉంది. అదేవిధంగా సీసీ కెమెరాలో రికార్డయ్యే దృశ్యాలు దాదాపు నెల రోజులు తక్కువ కాకుండా ఉండేలా ఫుటేజీ సేవ్ చేసే విధంగా ఉండాలి. రాష్ట్రంలో 1372 లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. వీటిలో తొలి విడతగా 2021లో 534 పోలీసు స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. మొక్కుబడిగా సాగిన అప్పటి ప్రయత్నంలో పోలీసు స్టేషన్‌కు కేవలం రెండు, మూడు కెమేరాలు ఏర్పాటు చేశారు. లాకప్‌లో తప్పనిసరిగా ఒకటి ఉండేది. అయితే కొంతమంది స్టేషన్ హౌసాఫీసర్లు ఆసక్తితో స్వంతంగా స్పాన్సర్లను పట్టుకుని మరిన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా హోంశాఖ ఉత్తర్వుల మేరకు స్టేషన్ విస్తీర్ణం పరిగణనలోకి తీసుకుంటూ పదికిపైగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతోపాటు వాటి రికార్డింగ్ నాణ్యత, బ్యాక్అప్ దాదాపు 18నెలల పాటు ఉండేలా సాంకేతిక పరిానాన్ని వినియోగిస్తున్నారు. రెండో విడతలో దాదాపు 600 పోలీసు సే ్టషన్లలో కొత్తగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసేందుకు హోంశాఖ టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. రెండు నెలల గడువులోగా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున ఇందుకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. రెండో విడతలో సుమారు 26కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది.
ఎంపిక చేసిన జిల్లాలు..
ఇప్పటికే ఎంపిక చేసిన విజయవాడ కమిషనరేట్‌లో 27, వి శాఖ కమిషనరేట్‌లో 20, కృష్ణా జిల్లా 27, విజయవాడ జీ ఆర్పీ 2, అల్లూరి సీతారామరాజు జిల్లా 1, అనకాపల్లి జిల్లా 29, అన్నమయ్య 17, అనంతపురం 39, చిత్తూరు 18, బాపట్ల 9, ఏలూరు 31, తూర్పు గోదావరి జిల్లా 24, గుంటూరు 23, కాకినాడ 23, కోనసీమ జిల్లా 20, కర్నూలు 34, నంధ్యాల 32, పల్నాడు 18, పార్వతీపురం మ న్యం జిల్లా 10, ప్రకాశం 17, నెల్లూరు 26, సత్యసాయి 31, కడప 22, పశ్చిమ గోదావరి 17, విజయనగరం 21, తిరుపతి 28, శ్రీకాకుళం 33 పోలీసు స్టేషన్లలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పూర్తి చేశారు. సీసీ కెమేరాలు ఆయా స్టేషన్లతోపాటు ఆ పరిధిలోని న్యాయమూర్తి, జిల్లా ఎస్పీ, పోలీసు కమిషనర్, డీజీపీ కార్యాలయాలకు అనుసంధానమై ఉంటుంది ముఖ్యంగా నేర ఘటనలకు ఆస్కారం ఉన్న చోట్ల ఏర్పాటు చేయనున్నారు.