Friday, November 22, 2024

వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎర్ర గంగిరెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర ద‌ర్యాప్తు బృందం (సీబీఐ) విచార‌ణ కొనసాగుతోంది. శుక్రవారం సీబీఐ విచార‌ణ‌కు ఆరుగురు అనుమానితులు హాజ‌ర‌య్యారు. వివేకానంద రెడ్డి ప్ర‌ధాన అనుచ‌రుడు ఎర్ర గంగిరెడ్డిని అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచార‌ణ కొన‌సాగుతోంది.

పులివెందుల‌కు చెందిన చిన్న‌ప్ప‌రెడ్డి, రామ‌చంద్రారెడ్డి, క‌డ‌ప‌లోని మోహ‌న్ ఆసుప‌త్రి య‌జ‌మాని ల‌క్ష్మీరెడ్డి, పులివెందుల‌కు చెందిన కాఫీ పొడి వ్యాపారి సుగుణాక‌ర్‌, సింహాద్రి పురం మండ‌లం సుంకేశుల‌కు చెందిన జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి వరుస‌గా మూడో రోజు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. గ‌తంలో వివేకాకు జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి పీఏగా ప‌నిచేశారు. ఇప్ప‌టికే వివేక హ‌త్య కేసులో అనుమానితులుగా ఉన్న ప‌లువురిని అధికారులు ప్ర‌శ్నించి ప‌లు వివ‌రాలు రాబట్టారు.

వివేకా హత్య కేసు కొంత కాలం విరామం తర్వాత జూన్ 7వ తేదీ నుంచి మళ్లీ విచారణ మొదలైంది. కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైల్‌లో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ… ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిని 2019 మార్చి 14న దుండగులు కిరాతంగా హత్య చేశారు. ఎన్నికలకు కొద్ది రోజులు జరిగిన ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. అప్పటి ప్రభుత్వం ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేసింది. అయితే, సిట్ ఆ దర్యాప్తులో ఏమీ తేల్చలేకపోయింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా సిట్ వేయగా.. కేసు ఎంతకీ తేల్చకపోవడంతో వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత హైకోర్టు ఆశ్రయించారు. వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement