Thursday, November 21, 2024

AP: గత ప్రభుత్వ స్కాములపై సీబీఐ విచారణ జరగాలి.. బుద్దా వెంకన్న

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. ముఖ్యంగా టీడీఆర్ బాండ్ల జారీ అంశంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని తన అన్యాయులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరేలా జగన్ ప్రభుత్వం వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిన ప్రతి అంశంలోనూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతూ ఉంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల శ్రేయస్సు కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుని చర్చించుకోవడం శుభపరిణామమన్నారు.

విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ… టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి అని, కారుమూరి నాగేశ్వరరావు సారథ్యంలో కోట్లు దోపిడీ జరిగిందన్నారు. తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారథ్యంలో మరో దోపిడీ జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవమన్నారు. జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరని అభిప్రాయపడ్డారు. కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకరరెడ్డి, కొట్టు సత్యనారాయణ, మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు.

జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలన్నారు. ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి.. వారి సొంత ఖజానాలను నింపుకున్నారని తెలిపారు. ఈ కుంభకోణాలపై సీఐడీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ తో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పని చేసిన అధికారులను సీఐడీ విచారించాలన్నారు. జగన్ ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారనీ, ఇప్పటి వరకు రెండు వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. విచారణ చేస్తే… ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుందన్నారు.

- Advertisement -

నిజాయతీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టే.. వారి దోపిడీ బయట పడిందన్నారు. ప్రభుత్వం వాల్యూ కట్టాలంటే.. కలెక్టర్లకు పాలకులే ఆదేశాలు ఇవ్వాలని, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందన్నారు. తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ఇవి దోచిపెట్టారన్నారు. ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు నా పోరాటం కొనసాగుతుందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ .. తెలుగు ప్రజలకు మేలు చేస్తుందన్నారు. జగన్ కు ఎన్నికల సమయంలో కేసీఆర్ డబ్బులు పంపించారాని, కానీ రాష్ట్రం కోసం ఎప్పుడూ ఇద్దరూ కూర్చుని చర్చలు చేయలేదన్నారు. చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో, అధికారులతో కమిటీలు వేశారని, జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేశాడన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement