ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ అధికారులు మరింత గడువు కోరడంతో చివరి అవకాశం ఇస్తూ సీబీఐ కోర్టు విచారణను జూన్ 1కి వాయిదా వేసింది. జగన్ బెయిల్ రద్దు చేయలంటూ నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది. లాక్ డౌన్ తదితరుల కారణాల వల్ల కౌంటర్ దాఖలు చేయలేదని జగన్ తరపు న్యాయవాదులు తెలుపారు. సీబీఐ నుంచి ఇంకా సూచనలు రాలేదని సీబీఐ న్యాయవాదులు కోర్టుకు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రఘురామ తరపు న్యాయవాది.. ప్రతివాదులకు జరిమానా విధించాలని కోరారు. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని జూన్ 1న కౌంటర్ దాఖలు చేయకపోతే నేరుగా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది.
సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. తర్వాత కోర్టు విచారణకు స్వీకరించింది. సీఎం జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో రఘురామ కోరారు. సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ అన్నారు. వైఎస్సార్‌సీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని రఘురామ చెప్పిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఇందూర్ పాలిటిక్స్: మంత్రికి బీజేపీ ఎంపీ వార్నింగ్