స్విట్జర్లాండులోని దావోస్‌లో ఈ నెల 22 నుంచి వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు జరగనున్నాయి. కాగా, ఈ సదస్సుకు ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వం వహించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు ఉంది. ఈ క్రమంలో ఏపీ సీఎం హోదాలో తాను దావోస్ పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అందుకు అనుమతించాలని జగన్ హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దావోస్ పర్యటన నేపథ్యంలో దేశం విడిచి వెళ్లరాదన్న నిబంధనను సడలించాలని ఆయన కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగగా.. దావోస్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి నిచ్చింది.
అయితే విచారణ సందర్భంగా దావోస్ వెళ్లేందుకు జగన్‌కు అనుమతి ఇవ్వరాదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జగన్ విదేశాలకు వెళితే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు దావోస్ వెళ్లేందుకు సీఎం జగన్‌కు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి 31 వరకు జగన్ దావోస్ పర్యటనకు కోర్టు అనుమతిని మంజూరు చేసింది.