అమరావతి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోసారి నోటీ-సులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన అవినాష్‌ను హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో మొదటి సారిగా సీబిఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఆరోజు ఏకంగా ఆయన్ను దాదాపు నాలుగున్నర గంటల పాటు విచారించారు. తాజాగా మరోసారి ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు వాట్సప్ ద్వారా అవినాష్‌రెడ్డికి శనివారం నోటీ-సులు జారీ చేశారు. వి వేకా హత్య కేసు కడప నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యాక సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఓ వైపు సీబీఐ హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు ముమ్మరం చేస్తే.. మరోవైపు సీబిఐ కోర్టులో విచారణ కూడా వేగమందుకుంది. దీనిలో భాగంగానే మొదటి సారి ఎంపీ అవినాష్‌ను ప్రశ్నించిన సీబిఐ అతని కాల్‌డేటాను కీలకంగా పరిగణించింది. ఫోన్‌కాల్ జాబితా ఆధారంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగ న్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఆ ఇంటి మనిషి నవీన్‌లకు నోటీసులిచ్చి కడపలో వారిద్దరినీ విచారించింది.
మరోవైపు కడప జైలులో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డిలతోపాటు బెయిల్‌పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్ దస్తగిరిలకు హైదరాబాద్ సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఈనెల 10వ తేదీన సీబీఐ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా మార్చి 10వ తేదీకి తదుపరి వాయిదా వేశారు. సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలు ప్రస్తుతం ఛంఛల్ గూడ జైలులో ఉన్నారు. అదేవిధంగా ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై ఇటీవల కోర్టు విచారణ సందర్భంగా వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత ఇద్దరూ వ్యతిరేకిస్తూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వరుస పరిణామాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మొదటి సారి విచారించిన తర్వాత చోటు చేసుకున్నవే. దూసుకెళ్తున్న సీబిఐ అధికారులు మరికొందరు కీలకమైన ప్రముఖులకు నోటీసులు జారీ చేసే అవకాశముందని కొద్దిరోజుల క్రితమే ప్రచారం జరిగింది. అయితే ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి విచారించేందుకు తాజాగా రెండోసారి నోటీసులులివ్వడం ప్రస్తుతం మరో సంచలనంగా మారింది. మళ్లీ విచారణకు పిలిచినప్పుడు రావాలని మొదట్లోనే సీబిఐ అధికారులు స్పష్టం చేశారు కూడా. కాగా తనకు నోటీ-సులు అందిన విషయం వాస్తవమేనని ఎంపీ అవినాష్‌రెడ్డి ధ్రువీకరించారు.
మొదటి నుంచీ ఆరోపణలే..
2019 మార్చి 15న వివేకా హత్య జరిగినప్పటి నుంచి ప్రతిపక్షాల ఆరోపణలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు- ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిపైనే వినిపించాయి. ఈ క్రమంలో 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐ 248 మంది సాక్షులు, అనుమానితులను విచారించి వాటి ఆధారంగా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్య అనంతరం గుండెపోటుతో చనిపోయారన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ప్రచారం, ఘటనాస్ధలంలో రక్తంమరకలు, సాక్ష్యాధారాలు చెరిపేయడం, పులివెందుల సీఐ శంకరయ్యని బెదిరింపులకు గురి చేయడం వంటి అంశాలు తీవ్రంగా పరిగణించిన సీ బిఐ అవినాష్ రెడ్డిని ప్రశ్నించడంలో ఇదే కారణమని తెలుస్తోంది. అయితే హత్య వెనుక కుట్ర కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది.