Thursday, September 5, 2024

AP | రికార్డుల నిర్వహణలో జాగ్రత్త.. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సూచన

మదనపల్లి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో): రెవెన్యూ రికార్డుల నిర్వహణలో భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ) ఆర్.పి.సిసోడియా అన్నారు. ఇటీవల సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయన మదనపల్లెకు వచ్చారు.

ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ సంబంధిత అంశాలపై ఈరోజు సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిసోడియా మాట్లాడుతూ… రెవెన్యూ అధికారులకు తమ పరిధిలోని ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండాలని అన్నారు.

ప్రజాస్వామ్యంలో రెవెన్యూ శాఖ ఎంతో కీలకమని, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో ప్రతి రెవెన్యూ ఉద్యోగి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రికార్డులు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తు ఆన్‌లైన్ చేయ‌డం జరుగుతుందని, రెవెన్యూ అధికారులు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు.

ఈ సందర్భంగా గతంలో ఇనాం భూముల రిజిస్ట్రేషన్లు, 22(ఎ) భూ సమస్యలు, 2020-23 సంవత్సరంలో జరిగిన పట్టా భూముల వివరాలు, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములకు కన్వర్షన్ చేయుట, చుక్కల భూముల సమస్యలు, అసైన్‌మెంట్ భూముల వివరాలు తదితర అంశాలపై డివిజన్ల వారీగా ఆర్డీఓలు, తహసీల్దార్లతో సమీక్షించారు.

- Advertisement -

ఈ సమావేశంలో మూడు జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చామకూరి (అన్నమయ్య), సుమిత్ కుమార్ (చిత్తూరు), వెంటేశ్వర్ (తిరుపతి)తో పాటు ఆ జిల్లాల ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement