Thursday, November 21, 2024

అదుపు తప్పుతున్న వలంటీర్‌.. పట్టించుకోని అధికారులు

రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాల్సిన గ్రామ వలంటీర్‌ అదుపు తప్పుతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ దాడులకు పాల్పడుతున్నాడు. ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు అయ్యాయి. అయినా అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో సంబంధిత అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ సంఘటన మండల పరిధిలోని ఊటుకూరులో బుధవారం వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా వలంటీర్‌గా పనిచేస్తున్న వారిపై ఎలాంటి కేసులు ఉండకూడదు. అతను పని చేస్తున్న వార్డు ప్రజలు చిన్న ఫిర్యాదు చేసినా, పనితీరు సక్రమంగా లేకపోయినా ఆ వలంటీర్‌ను తొలగించాల్సి ఉంది. అయితే ఊటుకూరులో పనిచేస్తున్న ఓ వలంటీర్‌పై ఇటీవల పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఆ గ్రామ వలంటీర్‌ ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయటమే కాకుండా ఓట్ల లెక్కింపు సమయంలో అవకతవకలు జరిగాయని అధికారులపై దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాకుండా వారు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకుని వీరంగం చేశాడు. దీంతో ఎన్నికల అధికారుల ఫిర్యాదు మేరకు ఆ వలంటీర్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అలాగే గతంలో ఆ వలంటీర్‌పై మరో మూడు కేసులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

క్రిమినల్‌ కేసులు ఉన్న ఆ గ్రామ వలంటీర్‌ దర్జాగా విధులకు హజరవుతుండటం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వలంటీర్‌ను తొలగించాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా ఉన్నారు. ఆ వలంటీర్‌కు అధికార పార్టీ నేతలు ఒత్తాసు పలుకుతున్నారని, అందువలన అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement