Friday, November 22, 2024

Toll Plaza: టోల్‌ప్లాజ్ వ‌ద్ద క్యూక‌ట్టిన కార్లు…విజయవాడ హైవేపై వాహనాల రద్దీ

సంకాంత్రి పండుగ‌కు హైద‌రాబాద్‌నుంచి సొంతూళ్ల‌కు ప్ర‌జ‌లు ప్ర‌యాణ‌మ‌వుతున్నారు. ఇవాళ్టి నుంచి 17వ‌ర‌కు విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ఉండ‌డంతో ప‌ల్లెల‌కు వెళ్తున్నారు. ఈనేప‌థ్యంలో హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబర్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది.

దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు క్యూకట్టాయి. టోల్‌ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్‌ మండల వ్యాప్తంగా ట్రాఫిక్‌ నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్‌ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, 30మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు జీఎమ్మార్‌ 30 మంది ఆదనపు సిబ్బందిని నియమించింది. వారు టోల్‌ప్లాజాతోపాటు చౌటుప్పల్‌ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏదైనా ప్రమాదం జరిగితే రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్‌, 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉంటే 100లేదా వాట్సాప్‌ నంబర్‌ 8712662111ను సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వాహనదారులకు ఏ సమస్య ఉన్నా 1033 నంబర్‌ను సంప్రదించాలని జీఎంఆర్‌ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement