ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు సిటీలో గంజాయి కలిగి ఉన్న 10మంది విద్యార్థులను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుప్రజ తెలిపారు. బుధవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. గుంటూరు సిటీలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి యువకులు, తల్లిదండ్రులను బెదిరించి, డబ్బులు తీసుకుని వెళ్లి, గంజాయి, యండియం వంటి మత్తు పదార్థాలను కొనుగోలు చేసుకుని సేవిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఏఎస్పీ అన్నారు.
పట్టాభిపురం సీఐ రాజశేఖర్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు బుధవారం టీం వర్క్ చేసి వివిధ ప్రాంతాల్లో గంజాయి తాగుతున్న గ్యాంగ్‌ని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన 10మంది వ్యక్తులలో 9మంది స్టూడెంట్స్ ఉన్నారని తెలిపారు. వారినుంచి 2 గ్రాముల గంజాయి, యండియం పొట్లాలు, లిక్విడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్ట్ చేసిన గంజాయి ముఠాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండటం గమనార్హమని ఆమె అన్నారు.