అమరావతి, ఆంధ్రప్రభ: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మానవాళిని కబళిస్తున్న క్యాన్సర్ భూతానికి కళ్ళెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామ, వార్డు క్లినిక్స్ స్థాయిలోనే క్యాన్సర్ కేసుల్ని ప్రాథమిక దశలో గుర్తించి అవగాహన కల్పించే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గ్రామస్థాయిలో నూరుశాతం క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టనున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో గ్రామస్థాయిలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేందుకు వైజాగ్ లోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రైలెట్‌ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసింది. ఇందుకు గాను గ్రామస్థాయిలో నియమించిన సీహెచ్‌ఓ (ఎంఎల్‌హెచ్‌పీ) ఏఎన్‌ఎం ఆశా వర్కర్లకుశిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నలభై ఏళ్ళుపై బడిన మహిళలకు మోమెగ్రామ్‌తో పాటు ఓరల్, సర్వయికల్ స్క్రీనింగ్ చేసేందుకు వీలుగా ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సహాయాన్ని తీసుకోనున్నారు. క్యాన్సర్ కేసుల్లో 60 నుంచి 70శాతం వరకు చివరి దశలో గుర్తించడంతో లక్షలు ఖర్చు చేసి చికిత్స అందించినా ఫలితం దక్కడం లేదు. గ్రామస్థాయి నుంచి స్క్రీనింగ్ నిర్వహించడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే చాలా ప్రాణాలు కాపాడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. క్యాన్సర్లలో తొలిదశలో 33.2 శాతం ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించినట్లైతే నయం చేయొచ్చు. మహిళల్లో రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లలో 49.2 శాతం ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే తక్కువ ఖర్చుతోనే వ్యాధిని నయం చేసే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పురుషుల్లో నోటి, మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్లు నమోదు అవుతున్నాయి.
ఏటా 70 వేల కేసులు నమోదు
రాష్ట్రంలో ప్రతి ఏటా 62 వేల నుండి 70 వేల వరకు క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ నివారణా సౌకర్యాల్ని మెరుగుపరిచే దిశగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సమగ్ర క్యాన్సర్ నివారణా విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ రూపొందించింది. సాంక్రమిక (కమూన్యికబుల్ డిసీజెస్) వ్యాధుల నుండి అసాంక్రమిక (నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్) వ్యాధుల దిశగా నివారణా భారం పెరుగుతున్న నేపథ్యంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ ప్రణాళిక ద్వారా క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్సను అందించగలిగితే వారి జీవన ప్రమాణం మెరగవుతుంది,
నివారణ సాధ్యమవ్వడంతో పాటు ఖర్చు కూడా తగ్గుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ కు సంబంధించి అధునాతన చికిత్స కోసం దాదాపు 20 శాతం మంది రోగు లు బెంగుళూరు, చెన్నయ్ వంటి నగరాలకు వెళ్తున్నారు. క్యాన్సర్ చికిత్స కోసం రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. మన రాష్ట్రంలో కూడా -టె-రిషరీ వైద్య సేవల్ని మెరుగుపర్చుకుంటే వారికి కూడా ఇక్కడే చికిత్స అందించే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన.
ఆరోగ్యశ్రీలో పెరుగుతున్న ఖర్చు
క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు భరోసా, నాణ్యమైన చికిత్స ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్ చికిత్సలను కూడా చేర్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్స కు రూ.600 కోట్లు- ప్రభుత్వం ఖర్చు చేసింది. దీంతో పెద్ద ఎత్తున క్యాన్సర్ ప్రొసీజర్లు కవరయ్యాయి. 2.8 లక్షల కు పైగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందించారు. 2019 నుండి 2020 వరకు దాదాపు 8.23 లక్షల మందికి క్యాన్సర్ చికిత్సను అందించేందుకు రూ.1706.77 కోట్లు- ఖర్చు చేసింది. మొదటి విడతగా ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో రూ. 120 కోట్లతో అధునాతన క్యాన్సర్ పరికరాల్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మిగతా మెడికల్ కాలేజీల్లో కూడా రెండో విడతలో ఏర్పాటు- చేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు. కర్నూలు లో స్టేట్ క్యాన్సర్ సెంటర్ ని నెలకొల్పేందుకు రూ.120 కోట్లు- కేటాయించింది. కడప లో వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి కోసం రూ.107 కోట్లు- ప్రభుత్వం కేటాయించింది. పేద ప్రజలెవరూ ఆర్థిక పరిస్థితి కారణంగా క్యాన్సర్ చికిత్స కు దూరం కాకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశ్యం. నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ మార్గ దర్శకాలను విజయవంతంగా అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.