Friday, November 22, 2024

AP: క్యాన్సర్ ఆసుపత్రి ప్రదాత – అదే రతన్ టాటా మానవత‌..

తిరుపతి, రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో: భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా సామాజిక సేవా దృక్పథానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవకు ప్రతిరూపంగా తిరుపతిలో అత్యాధునిక శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్సుడ్ రీసెర్చ్ (శ్వీకార్) ఆవిర్భవించింది. తిరుమలేశునిపై అచంచల భక్తి విశ్వాసాలున్న రతన్ టాటా తరుచుగా తిరుమలకు వచ్చి మొక్కులు తీర్చుకునే వారు.

2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పలువురు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యేవారు. ఆ క్రమంలోనే 2015- 2017 మధ్యకాలంలో ఒక సారి ఢిల్లీలో, మరోసారి అమరావతిలో టాటా గ్రూప్ అధినేత రతన్ టాటాతో సమావేశమ‌య్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చిన రతన్ టాటా తమ గ్రూప్ సామాజిక సేవాకార్యక్రమాలు వివరిస్తూ కాన్సర్ వ్యాధి నిరోధానికి చేయాల్సిన కృషి గురించి వివరించారు. దేశ వ్యాప్తంగా 120 పైగా కాన్సర్ ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు చెప్పారు.

స్విమ్స్, బర్డ్ వంటి జాతీయ స్థాయి ప్రమాణాల ఆసుపత్రులున్న తిరుపతిలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా తనకు కూడా ఆ ఆలోచన ఉందని, అక్కడి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) సహకారాన్ని ఆకాంక్షిస్తున్నానని రతన్ టాటా వివరించారు. ఆ సమావేశం తరువాత స్పందించిన చంద్రబాబు టీటీడీ ఉన్నతాధికారులతో, చిత్తూరు జిల్లా అధికారులతో చర్చించారు. ఆ చర్చల ఫలితంగా టీటీడీ సహకారంతో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు నాంది జరిగింది. 2018 జనవరిలో తిరుమలేశుని దర్శనానికి వచ్చిన రతన్ టాటాతో టీటీడీ ఉన్నతాధికారుల చర్చలు జరిగి మౌలికంగా ఒక అంగీకారం కుదిరింది.

- Advertisement -

2018 ఆగస్టు 31వ తేదీన అలిపిరి సమీపంలో టీటీడీ కేటాయించిన 25ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ ఆడ్వాన్సుడ్ రీసెర్చ్ (శ్వీకార్) పేరుతో రూ.600 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటునకు రతన్ టాటాతో కలిసి చంద్రబాబు శంకు స్థాపన చేశారు. అప్పుడే టీటీడీ – టాటా ట్రస్ట్ అనుబంధంగా ఏర్పడిన అలిమేలు చారిటబుల్ ఫౌండేషన్ ల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు.

ఆ సందర్భంగానే రతన్ టాటా మాట్లాడుతూ… తిరుమలేశుని పాదాల చెంత క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన తనదే అయినా చంద్రబాబు చూపిన చొరవ కారణంగానే ఇంత త్వరగా శంకుస్థాపన సాధ్యమైందని అంటూ తమ మధ్య జరిగిన చర్చల గురించి వివరించారు. తన ఆశను నెరవేర్చుకోవడంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు చంద్రబాబు కృషి ఉందని కూడా అన్నారు.

ఇక శంకుస్థాపన జరిగిన నాలుగేళ్ళ తరువాత 2022 మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో టాటా ట్ర‌స్ట్ సీఈఓ శ్రీనాథ్ అలిమేలు చారిటబుల్ ట్రస్ట్ సీఈఓ సంజీవ్ చోప్రా పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో రాలేకపోతున్నానని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శ్వీకార్ సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ రతన్ టాటా సందేశాన్ని పంపించారు. ఆ విధంగా తిరుపతి ప్రాంత వైద్యసేవా రంగ సంస్థలకు తలమానికంగా 60శాతం పేదలకు ఉచిత వైద్య చికిత్స అందించే శ్వీకార్ ఆసుపత్రి ఏర్పాటు కావడం వెనుక రతన్ టాటా చిరస్మరణీయులుగా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement