Tuesday, November 26, 2024

ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ రద్దు! జీవో విడుదల చేసిన సర్కార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు బుధవారం జీఓ ఎంఎస్‌ నెం. 18ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఎంసెట్‌లో వచ్చే ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌, ఫార్మ్‌-డి తదితర కోర్సుల్లో ప్రవేశం కోసం ఇంటర్‌ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీని 2023-24 విద్యాసంవత్సరం నుంచి ఇక ఉండబోదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా ఉండబోదని గతలంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా వెయిటీజేని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ప్రభావం కారణంగా మూడేండ్లుగా ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ విద్యాసంవత్సరం ఇంటర్‌ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు గతంలో నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ జేఈఈ సహా ఇతర రాష్ట్రాలకు అనుసరిస్తూ ఈ ఏడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్‌ తుది ర్యాంకును నిర్ణయించడం జరుగుతోంది. ఎంసెట్‌ పరీక్షలో సబ్జెక్టులైన గణితం, ఆ తర్వాత ఫిజిక్స్‌, చివరగా కెమిస్ట్రిలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకు నిర్ణయిస్తారు. గత కొన్నేళ్లుగా మార్కులు కాకుండా పర్సంటైల్‌ను లెక్కిస్తున్నారు. పర్సంటైల్‌ కూడా ఒకటే వస్తే పుట్టిన తేదీని పరిగణలోకి తీసుకొని ఎవరు పెద్దవారైతే వారికి మెరుగైన ర్యాంకును కేటాయిస్తారు. కరోనా కారణంగా 2020, 2021, 2022 ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ తొలగించారు.

- Advertisement -

ఈ ఏడాదితో కూడా కలిపి వరుసగా నాలుగేళ్లుగా ఇంటర్‌ వెయిటేజీ లేకుండానే ఎంసెట్‌ ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో ఎంసెట్‌-2023 నుంచి ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ శాశ్వతంగా రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్‌ విద్యార్థులు బట్టీపట్టి 900లకు పైగా మార్కులు పొందుతున్నారు. కానీ అదే ఎంసెట్‌లో కనీస మార్కులు కూడా పొందలేకపోతున్నారు. సబ్జెక్టు పరిజ్ఞానం లేనివారిని ఫిల్టర్‌ చేయాలనే ఉద్దేశ్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షలకు కూడా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎప్పుడో తొలగించారు.

రాష్ట్రంలో ఎంసెట్‌ రాసే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. తెలంగాణ విద్యార్థులే కాకుండా ఏపీ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం టీఎస్‌ ఎంసెట్‌కు హాజరవుతున్నారు. దీంతో డిమాండ్‌ పెరుగుతోంది. మన దగ్గర ఐటీ రంగంలో ఉద్యోగవకాశాలు గణనీయంగా లభించడం, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లలో ఉత్తమ ప్యాకేజీలు లభిస్తుండటంతో విద్యార్థులు ఇటువైపే క్యూ కడుతున్నారు. నాలుగేళ్లుగా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య భారీగానే ఉంది. గత సంవత్సరం ఎంసెట్‌ ప్రవేశ పరీక్షకు 2,66,719 దరఖాస్తులు రాగా, ఈ ఏడాది ప్రస్తుతం 3,18,018 దరఖాస్తులు వచ్చాయి. ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు మే 12, 13, 14 తేదీల్లో, అగ్రికల్చర్‌, ఫార్మసీ స్ట్రీమ్‌ల పరీక్షలు మే 10, 11 తేదీల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఎంసెట్‌ దరఖాస్తుకు ఆలస్య రుసుముతో మే 2 వరకు గడువుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement