2018 నాటి ఏపీ గ్రూప్-1 నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేశాయి. దీనిపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ (27/2018) ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబుపత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేత్తో దిద్దడం) అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలూ చట్టవిరుద్ధమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీచేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వాన్ని, ఏపీపీఎస్సీని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని పేర్కొంది.