( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఇక నుండి ప్రతి గ్రామానికి స్వయంగా రానున్నది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రచార రథం ద్వారా అమ్మవారు పలు జిల్లాలో ఉన్న ఎంపిక చేసిన గ్రామాలకు వెళ్తూ ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాలలో ప్రత్యేక పూజలు హోమాలు కుంకుమార్చనలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో గ్రామాంతరం వెళ్తున్న దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన ప్రచార రథాన్ని ఆలయ డిప్యూటీ ఈవో రత్నరాజు జండా ఊపి ప్రారంభించారు. గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి నుండి బయలుదేరిన ఈ ప్రచార రథం గ్రామోత్సవంలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో రేపటి నుండి పర్యటించనుంది.
ఈనెల ఆరవ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు నాలుగు నుండి ఆరు గ్రామాలలో ఈ ప్రచార రథం పర్యటించనుంది.
మొదటిగా ఈనెల 6వ తేదీన తణుకులో ప్రారంభమవుతున్న గ్రామోత్సవంలో భాగంగా జగ్గంపేటలో కుంకుమార్చనను నిర్వహించనున్నారు.
అలాగే వివిధ ప్రాంతాలలో గ్రామోత్సవము కుంకుమార్చన చండీ హోమాలను ప్రచార రథం వద్ద నిర్వహించనున్నారు. చివరిగా ఈ నెల 12వ తేదీ శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం లో గ్రామోత్సవంతో పర్యటన ముగియనున్నది.