అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేయగా పార్టీ కోసం కష్టపడినవారికి ప్రాధాన్యం ఇచ్చారు. త్వరలోనే మరో జాబితా విడుదల చేస్తారని చెబుతున్నారు.. తాజాగా మరో కీలక పదవిని కూడా భర్తీ చేశారు.. ఈ మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు బంపరాఫర్ ఇచ్చారు. ఆయనకు ఏకంగా కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు .
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ (కార్యక్రమాల నిర్వహణ)గా రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను నియమించారు. కీలక పదవితో పాటుగా కేబినెట్ ర్యాంక్ కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ముందు నుంచి పెందుర్తి వెంకటేష్ చంద్రబాబు కార్యక్రమాలకు సంబంధించి కోఆర్డినేటర్‌గా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు అధికారికంగా కోఆర్డినేటర్‌గా నియమించారు. ఆయన గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. సీఎం చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షించనున్నారు.