రాయలసీమ జిల్లాల్లో మంత్రివర్గ పునర్‌వ్యవస్దీకరణ సందడి మొదలైంది. ప్రస్తుతం ఉన్న ఆరుగురు మంత్రుల్లో నలుగురికి ఉద్వాసన దాదాపుగా ఖరారైనట్టు పార్టీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. మిగిలిన ఇద్దరిలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాయలసీమ జిల్లాల పార్టీ బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం కొనసాగుతోంది. ఇక ఖాళీ అయ్యే స్ధానాలతో పాటు కొత్తగా ఏర్పడే జిల్లాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం డజను మందికిపైగా శాసన సభ్యుల పేర్లు ఆశావహుల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే మంత్రి పదవులు మార్పుచేర్పులలో పనితీరు, సర్వే నివేదికలు, సీనియారిటీలతో పాటు కులపరమైన, మతపరమైన సమీకరణలు కీలకపాత్ర పోషించనున్నాయని స్పష్టమవుతోంది.
తిరుపతి, ప్రభన్యూస్ బ్యూరో (రాయలసీమ) : 2019లో జరిగిన ఎన్నికలలో మొత్తం 52 శాసనసభా స్దానాల్లో 49 స్దానాల్లో విజయం సాధించడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాయలసీమ ప్రాంతం కంచుకోటగా మారిన విషయం అందరికీ తెలిసిందే. దానికి తగినట్టుగానే ముఖ్యమంత్రి పదవి కాకుండా రెండు ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు ఆరుగురికి రాష్ట్ర మంత్రివర్గంలో స్ధానం లభించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మొదలైన కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ఆరునెలలకు పైగా నలుగుతూవున్న రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్దీకరణ సందడి రాయలసీమ ప్రాంతంలో చర్చనీయాంశమవుతోంది.
విస్తీర్ణం, పరిధుల వివాదాలు, వినతులు, ఆందోళనల నడుమ మొదలైన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఉన్న నాలుగు జిల్లాల సంఖ్య ఎనిమిది జిల్లాలకు పెరగడం మాత్రం ఖరారైపోయింది. మరోవైపు మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయా సందర్భాలలో మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ విషయంలో చేసిన వ్యాఖ్యల సారాంశాలు, స్దానికంగా మంత్రిపదవుల్లో ఉన్నవారి పనితీరు, వారి బలాలు, బలహీనతలు, వారిపై పార్టీ వర్గాల్లో, ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు రాయలసీమ ప్రాంత మంత్రుల తొలగింపులో కీలకపాత్ర పోషించనున్నాయని స్పష్టమవుతోంది.
ఈ కోణంలో చూసినప్పుడు కర్నూలు జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి (డోన్), చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు) మంత్రివర్గంలో కొనసాగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కానీ వీరిద్దరిలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలలో కీలకపాత్ర పోషిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ రాయలసీమ ప్రాంతీయ నేతృత్వ బాధ్యతలను అప్పగించే అవకాశాలున్నాయని, ఈ విషయం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా రామచంద్రారెడ్డికి చెప్పి ఒప్పించారనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్న కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా (కడప) ,ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి (గంగాధరనెల్లూరు)లతో పాటు అనంతపురం జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం. శంకరనారాయణ (పెనుగొండ), కర్నూలు జిల్లాకు చెందిన కార్మికశాఖ మంత్రి పి. జయరామ్ (ఆలూరు) లపై వేటు పడే అవకాశాలున్నట్టు ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఈ విషయంలో పనితీరు, పార్టీవర్గాల, ప్రజల అభిప్రాయాలు, సమీకరించిన సర్వే నివేదికలు కీలకపాత్ర పోషించ నున్నాయని, ఇప్పటికే ఆ నలుగురికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పార్టీ అధినేత నుంచి సంకేతాలు అందాయని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలావుండగా, ఇతర అంశాల సంగతెలా ఉన్నా పెరిగిన జిల్లాల సంఖ్యకు తగినట్టుగా రాయలసీమ జిల్లాల్లో మంత్రి పదవులు ఆశించే ఆశావహుల సంఖ్య సహజంగానే గణనీయంగా పెరుగుతోంది. పార్గీ అంతర్గత వర్గాల్లో కొనసాగుతున్న చర్చల ఆధారంగా జిల్లాలవారీగా మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నవారు, ఆశావహుల వివరాలు ఇలావున్నాయి. కడప జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, కడప శాసనసభ్యుడు అంజాద్ బాషాను మంత్రివర్గం నుంచి తప్పించి కొత్తగా రాయచోటి కేంద్రంగా ఏర్పడే అన్నమయ్య జిల్లాకు చెందిన కోడూరు శాసనసభ్యుడు కోరముట్ల శ్రీనివాసులుకు మంత్రివర్గంలో స్ధానం లభించే అవకాశం ఉంది. కడప జిల్లాలో మరొకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటే సీనియారిటీ ప్రాతిపదికన రఘురామిరెడ్డి (మైదుకూరు)కి అవకాశం ఉంటుంది. ఇక ఈ జిల్లాలో మంత్రిపదవి ఆశించేవారిలో శాసనసభ్యులు గ డికోట శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), ఎం. సుధీర్‌రెడ్డి (జమ్మలమడుగు) పేర్లు వినవస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో మంత్రి పి.జయరామ్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి (బనగానిపల్లె)కి కానీ, మైనారిటీ కోటా పరంగా అయితే హఫీజ్ ఖాన్ (కర్నూలు)కు కానీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. వీరుకాక మంత్రి పదవి ఆశించేవారిలో బాలనాగిరెడ్డి (మంత్రాలయం), శిల్పా చక్రఫాణిరెడ్డి (శ్రీశైలం) ల పేర్లు వినవస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి శంకరనారాయణను మంత్రివర్గం నుంచి తప్పిస్తే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (రాప్తాడు)కు కానీ, కులసమీకరణల పరంగా ఉషశ్రీ కిరణ్ (కళ్యాణదుర్గం), పద్మావతి (సింగనమల)లలో ఒకరికి కానీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. సీనియారిటీ ప్రాతిపదికన అయితే అనంతవెంకటరామిరెడ్డి (అనంతపురం)కి లభిస్తుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నారాయణస్వామిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఆర్.కె.రోజా (నగరి)కి, కులపరమైన సమీకరణల పరంగా అయితే ఆదిమూలం (సత్యవేడు)కు మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. అయితే జిల్లాల పరిధుల ప్రకారం భూమన కరుణాకరరెడ్డి (తిరుపతి), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి)లకు మంత్రివర్గంలో స్దానం లభించగలదని వారి వర్గీయులు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే కొనసాగుతున్న ప్రచారం ప్రకారం జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ ప్రాంతీయ బాధ్యతలను అప్పగిస్తే అటు అన్నమయ్య జిల్లాతో పాటు ఇటు చిత్తూరు, శ్రీబాలాజీ జిల్లాలకు చెందినవారికి మంత్రి పదవులు ఇచ్చే విషయంలో ఆయనే కీలకపాత్ర పోషించే అవకాశాలుంటాయి. మొత్తంమీద రాయలసీమ ప్రాంతానికి చెందిన నాలుగు జిల్లాలు ఎనిమిది జిల్లాలుగా పెరగనున్న తరుణంలో చేపట్టే మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణలో ఖాళీ అయ్యే అవకాశాలున్న నాలుగు మంత్రి పదవులను కనీసం డజను మంది సీమ శాసనసభ్యులు ఆశించేవారిలో ఉన్నారని మాత్రం స్పష్టమవుతోంది.