తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ఎలాంటి రాజకీయ లక్షణాలు లేవని మాజీమంత్రి ,ఎమ్మెల్సీ రామచంద్రయ్య విమర్శించారు. కడపలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కేవలం తండ్రి వల్ల ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. ప్రజా క్షేత్రంలో నారా లోకేష్ గెలవలేక పోయాడని ఎద్దేవా చేశారు. లోకేష్ ఎంత అసమర్థుడో 40 ఏళ్ళ టీడీపీ సంబరాల్లో తేలిపోయిందన్నారు. ఎన్టీఆర్ ఏ ఉద్దేశ్యంతో అయితే పార్టీ పెట్టారో ఆ సిద్ధాంతం నేటి టీడీపీలో లేదన్నారు. చంద్రబాబును ఎందుకు ప్రజలు తిరస్కరించారో ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు 27 ఏళ్లలో 6 సార్లు ఎన్నికలకు వెళితే 3 సార్లు ఓడిపోయాడని విమర్శించారు. ఒక్కడుగా ఏనాడూ గెలవలేదన్నారు. ప్రతి ఎన్నికల్లో ఎదో ఒక పార్టీ పొత్తులతోనే గెలిచాడన్నారు.
టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేసారని ఆరోపించారు. తన అధికారం కోసం పాకులాడే చంద్రబాబును ఎవరూ విశ్వసించరన్నారు. ఏ సిద్ధాంతం లేకుండా ఉండడమే సిద్ధాంతంగా టీడీపీని చంద్రబాబు నడుపుతున్నారన్నారు. వైఎస్ జగన్ ఆర్థిక నిపుణుడు కాదు.. ప్రజల కష్టాలు, బాధలు ఏమిటో తెలుసు, వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన ప్రజా నాయకుడన్నారు. ఆర్థిక ఇబ్బదులున్నా సంక్షేమ పథకాల మొత్తాలను నేరుగా ప్రజల ఖాతాలోకి జమచేసిన నాయకుడు జగన్ అని కొనియాడారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందించాలి, ప్రతిపక్షంగా మంచి సలహాలు ఇవ్వాలన్నారు. ఒక చిన్న తప్పు జరిగితే రాద్ధాంతం చేయడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టారు.