అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని అమరావతి ప్రాంతాన్ని.. రెండు జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఏర్పాటు కానున్న విజయవాడ ఈస్ట్, వెస్ట్ బైపాస్ రోడ్డులకు లైన్ క్లియర్ అయింది. వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.. మరో ఏడాదిలో రెండు ప్యాకేజీలకు సంబంధించి పనులు పూర్తిచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు సంస్థలకు గడువు విధించాయి. గన్నవరం మండలం పెద్దఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా గుంటూరు జిల్లా చినకాకాని ఎన్నారై మెడికల్ కాలేజీ వరకు సుమారు 48 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ ఆరు లైన్ల రహదారి చెన్నై- కోల్కట జాతీయ రహదారి (ఎన్‌హెచ్65), చెన్నై- హైదరాబాద్ (ఎన్‌హెచ్16)తో అనుసంధానం కానుంది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 18 కిలోమీటర్ల పొడవున ఓ ప్యాకేజీ, గొల్లపూడి నుంచి పెద్దవుటపల్లి వరకు 30 కిలోమీటర్లతో మరో ప్యాకేజీగా వర్గీకరించి పనులు చేపట్టారు.
గుంటూరు జిల్లాలో రాజధాని అమరావతి గ్రామాలను తాకుతూ కృష్ణానదిపై మూడున్నర కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం మందడం- కృష్ణాయపాలెం గ్రామాల మధ్య ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పాటు వెంకటపాలెం, ఉండవల్లిని కలుపుతూ మరో ఫ్లై ఓవర్‌ని కృష్ణానదిపై నిర్మించే వంతెనతో అనుసంధానం చేయనున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయికి పెంచడంతో రద్దీ పెరిగింది. దీన్ని నియంత్రించేందుకు విజయవాడ బైపాస్కు మోక్షం కల్పించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. పుష్కరకాలంగా ఆగిన ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతున్నాయి.. సుమారు 4700 కోట్ల అంచనా వ్యయంతో ఈస్ట్ బైపాస్ ఏర్పాటు కానుంది. కృష్ణాజిల్లా పెద్దవుటపల్లి నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి.
ఈ మార్గంలో అప్రోచ్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జీలు, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణాలు సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నున్న పవర్ గ్రిడ్ సమీపంలో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయితే రామవరప్పాడు, గుణదల, కండ్రిక పైపులరోడ్డు జంక్షన్, జక్కంపూడి, ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు రవాణా సదుపాయం కలుగుతుంది. విశాఖ పట్టణం నుంచి నేరుగా హైదరాబాద్‌కు కూడా ఈ రోడ్డు అందుబాటులోకి రానుంది. దీంతో పాటు గుంటూరు జిల్లాలో చెన్నై నుంచి వచ్చే వాహనాలు మంగళగిరి మండలం నిడమర్రు, మందడం, వెంకటపాలెం మీదుగా ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా ఎన్‌హెచ్ 16ను కలుస్తుంది. వెస్ట్ బైపాస్ రోడ్డు మరో ఏడాదిన్నర లోపు పూర్తయ్యేలా పనులు జరుగుతున్నాయి. కాగా కృష్ణాజిల్లా పొట్టిపాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు ఈస్ట్ బైపాస్ రోడ్డు ప్రతిపాదనలకు ఎ ట్టకేలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం తెలిపింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లంక గ్రామాలను కలుపుతూ కృష్ణానదిపై మరో వంతెన నిర్మాణం జరగనుంది. వెస్ట్ బైపాస్‌తో పాటు ఈస్ట్ బైపాస్ సిద్ధమైతే కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ భారీ అవుటర్ రింగురోడ్డుకు అంకురార్పణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బైపాస్ రోడ్డును 49 కిలోమీటర్ల మేర ఆరు లైన్లలో నిర్మించనున్నారు. కృష్ణాజిల్లాలో 29 కిలోమీటర్లు, గుంటూరు జిల్లాలో 20 కిలోమీటర్ల మేర ఈస్ట్ బైపాస్కు ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇందుకయ్యే భూ సేకరణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యయాన్ని భరించలేమని కేంద్రానికి నివేదించడంతో ప్రాజెక్టు నిర్మాణంలో అవసరమయ్యే వివిధరకాల సీనరేజి, రాష్ట్ర జీఎస్టీని మినహాయించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈస్ట్ బైపాస్‌లో భాగంగా నిర్మితమయ్యే మల్టి లాజిస్టిక్ పార్కుకు వందెకరాల స్థలాన్ని కూడా అందించాలని సూచించింది. ఇందుకోసం మంగళగిరి వద్ద రాష్ట్ర ప్రభుత్వం భూములు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
కృష్ణా తూర్పు బైపాస్ కృష్ణాజిల్లా ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, తోట్లవల్లూరు, పెనమలూరు, ఉయ్యూరు మండలాల్లోని.. ఆత్కూరు, పెదఅవుటపల్లి, అల్లాపురం, బుతిమిల్లిపాడు, తెన్నేరు, తరిగొప్పుల, మారేడుమాక, కోమటిగుంట, మానికొండ, కోలవెన్ను, దావులూరు, నేపల్లె, చలివేంద్రపాలెం, బొడ్డపాడు, రొయ్యూరు మీదుగా వెళ్లనుంది. అక్కడినుంచి కృష్ణా నదిపై వంతెన దాటాక గుంటూరు జిల్లాలోని కొల్లిపర్ల, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని.. వల్లభాపురం, పెరకలపూడి, చుక్కపల్లివారిపాలెం, మోరంపూడి, చిలువూరు, తుమ్మపూడి, చినకాకాని, కాజ గ్రామాల మీదగా ఎన్‌హెచ్-16లో కలుస్తుంది. తరిగొప్పుల, మోరంపూడిల వద్ద రైల్వేలైన్లు, దావులూరు వద్ద మచిలీపట్నం-విజయవాడ జాతీయరహదారి మీదగా తూర్పుబైపాస్ వెళ్లేలా ఎలైన్మెంటు రూపొందించారు. అయితే డీపీఆర్ ఇంకా తుది రూపు దిద్దుకోలేదు.
ఇదిలా ఉండగా మూడు రాజధానుల ప్రకటనతో అమరావతి ప్రాంతంలో తగ్గిన భూముల ధరలు రెండు బైపాస్‌లు రానుండటంతో ఊపందుకుంటున్నాయి.. రాజధాని గ్రామాల్లో చదరపు గజం రూ. 8 వేలు ఉండగా ప్రస్తుతం 18 వేలకు చేరింది. జాతీయ రహదార్ల అనుసంధానంతో బైపాస్‌లు ఏర్పాటుకానున్న నేపథ్యంలో రియల్ వ్యాపారంలో కదలికలు మొదలయ్యాయి. కోవిడ్, ప్రభుత్వ ఆంక్షల కారణంగా ఇప్పటి వరకు భూముల కొనుగోళ్లు మందగించాయి. బైపాస్ నిర్మాణ పనులు పుంజుకోవటంతో పాటు ఈస్ట్ బైపాస్‌తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి పునరుజ్జీవం పోసినట్లయిందనేది స్పష్టమవుతోంది.