Thursday, November 7, 2024

2027 నాటికి భారత్‌ మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతుంది… రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి27 (ప్రభ న్యూస్‌): 2027 నాటికి ప్రపంచ దేశాల్లోనే భారత్‌ మూడో ఆర్ధిక శక్తిగా ఎదుగుతుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాధ్‌ సింగ్‌ అన్నారు. విశాఖలోని భారత్‌ రైజింగ్‌ ఎలైట్‌ పేరిట మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…. భాష, ప్రాంతీయ వాదం పేరుతో దేశ సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని, సౌత్‌, నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరగుతున్నాయన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటిని అడుగుతున్నారని, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ తాము అధికారంలో ఉన్నామన్నారు. ఏపీలో బీజేపీకి గతం కంటే ఓటు బ్యాంక్‌ పెరిగిందని, బీజేపీ ఏదో ఒక రోజు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి అనే అంశాలు కాంగ్రెస్‌ పార్టీకి అమ్మలాంటివి అని రాజ్‌నాధ్‌ సింగ్‌ ఆరోపించారు.

రాఫెల్‌ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే దేశీయ నైపుణ్యంతో అధ్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నామన్నారు. కేవలం రాజకీయాల కోసమే భారత జనతాపార్టీ లేదని, దేశాన్ని ప్రపంచ అగ్రస్ధానంలో నిలపాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్‌, సివిల్‌ కామన్‌ కోడ్‌, అయెధ్య రామ మందిరం, ఆర్టిక్‌ 370 వంటి సాహసోపేత నిర్ణయాలు బీజేపీ అమలు చేసిందన్నారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో భారత్‌ ప్రపంచ ఆర్ధిక శక్తిగా అవతరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రపంచంలోని యూరప్‌, అమెరికా వంటి దేశాలు సైతం ఆర్ధికలోటు విషయంలో ఇబ్బందులు పడుతుంటే మోడీ చొరవతో భారత్‌లో ఆర్ధికలోటును నియంత్రించగలిగామన్నారు. స్వప్రయోజనాల కంటే దేశ ప్రయోజానాలే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ… బీజేపీ అన్ని పార్టీల కంటే భిన్నమైనదని, పేదరిక నిర్మూలన, మహిళల రక్షణ, సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి స్వయం సహాయ యోజన, ముద్ర రుణాలను వినియోగించుకుంటూ మహిళలు ఆర్ధికంగా ఎదుగుతున్నారన్నారు. 2014 ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కేవలం స్కామ్‌లు మాత్రమే ఉండేవని, మోడీ అధికారంలోకి వచ్చాక స్కీమ్‌లు అందుతున్నాయన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని, కేవలం లాభాల బాటలో పయనించే విధంగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూమి కేటాయించకుండా ఆయా నెపాన్ని కేంద్రంపై నెట్టడం సరికాదన్నారు.

- Advertisement -

ఏపీ అభివృద్ధిని అగ్రగామిలో నిలబెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అవినీతికి తావులేని పాలన అందిస్తామని, వచ్చే ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలన్నారు. ఆంధ్రాలో ఒక్కసారి…. కేంద్రంలో మరోసారి కేంద్ర సర్కార్‌ పేరిట ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాజ్యసభ్య సభ్యులు జీవిఎల్‌ నరసింహరావు, సిఎం రమేష్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్‌ మాధవ్‌, పి.విష్ణుకుమార్‌ రాజు, కార్యదర్శి కాశీ విశ్వనాధరాజు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రతో పాటు, పలువురు మహిళా ప్రతినిధులు, మేధావులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement