అగ్ని ప్రమాదం ఘటనపై ప్రత్యక్ష విచారణ
సబ్ కలెక్టరేట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్
తెల్లవారుజాము వరకూ అక్కడే అధికారులు
మరోసారి సీన్‌లో ఇద్దరు అనుమానితులు
పరారీలోనే కీలక నిందితులు
సీరియస్‌గా ఫోకస్ పెట్టిన సీఐడీ డిపార్ట్‌మెంట్
ఆంధ్రప్రభ స్మార్ట్, మదనపల్లి :
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్‌కలెక్టరేట్‌లో పైళ్ల దగ్ధం కేసులో అమీతుమీని తేల్చేందుకు ఏపీ సీఐడీ అధికారులు పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఇది ప్రమాదమా? పైళ్ల కాల్చివేత కుట్ర అనే అంశాన్ని తేల్చటానికి ఆధారాల సేకరణలో దూసుకు పోతున్నారు. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో అనుమానితులను సీఐడీ ప్రశ్నించినా… ఇప్పటికీ కీలక ఆధారాలు వెలుగులోకి రాలేదు. ఎవ్వరినీ అరెస్టు చేయలేదు. కీలక అనుమానితులంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఇక అరెస్టుల పర్వాన్ని ప్రారంభించేందుకు కేసు విచారణలో సీఐడీ దూకుడు పెంచింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ సీఐడీ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేపట్టారు.
అనుమానితలతో మరోసారి విచారణ..
రాత్రి 12:30 గంటల వరకు వీఆర్ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను అధికారులు విచారించారు. వీడియో రికార్డింగ్ మధ్య సీన్‌ను రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులను విచారించారు. అగ్నిప్రమాద ఘటన సమయంలో ఎక్కడి నుంచి మంటలు వ్యాపించాయి, ఎంత వరకు ఫైళ్లు కాలిపోయాయనే కోణంలో ఫైర్ అధికారులను కూడా సీఐడీ అధికారులు విచారించారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల వరకు సబ్ కలెక్టరేట్‌లోనే సీఐడీ అధికారులు తిష్ట వేసి మరీ విచారణను చేపట్టారు.
ప్రెస్టేజియస్‌గా ప్రభుత్వం దూకుడు
అగ్నిప్రమాదంలో ఫైళ్ల దగ్ధం అయిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఎలాగైనా నిజనిజాలు బయటపెట్టాలనే ఉద్దేశంతో కేసును ఈనెల 8న పోలీసుల నుంచి సీఐడీకి బదిలీ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత రాత్రి అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ డీఎస్పీ వేణగోపాల్ ఆధ్వర్యంలో విచారణను మొదలుపెట్టారు. జూలై 21న రాత్రి సమయంలో మదనపల్లి సబ్‌కలెక్టరేట్ కార్యాయలంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 22-ఏ సెక్షన్లో కీలకమైన పైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తమ అక్రమాలు బయటకు రాకుండా వైసీపీ నేతలే ఇలాంటి చర్యలకు పాల్పిడ్డారా? అనుమానాలను నివృత్తి చేసుకునే ప్రయత్నంలో సీఐడీ అధికారులు బిజీ బిజీగా ఉన్నారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న అగ్రహారం వీఆర్ఏ.. ఆర్డీఏకు సమాచారం అందజేశాడు. ఆర్డీఏ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
నిందితులందరూ పరారీలోనే
ఈ ఘటనపై డీజీపీ తిరుమలారావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ ప్రమాదస్థలిని పరిశీలించి ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను కాల్చివేశారని తేల్చిచెప్పారు. దీంతో ఈకేసును సీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. విచారణలో భాగంగా వీఆర్‌ఏ రమణయ్య, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ, ఇద్దరు ఆర్డీవోలను పోలీసులు విచారించారు. అంతేకాకుండా మదనపల్లి తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జింకా వెంకటచలపతి, పెద్దిరెడ్డి ముఖ్యఅనుచురుడు వి.మాధవరెడ్డి, శశిధర్ రెడ్డి ఇళల్లో సోదాలు చేసిన పోలీసులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వీరందరిపైన నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. సీఐడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును రహస్యంగా నిర్వహింటంతో.. అనేక అనుమానాలు వ్యక్తం కాగా.. ఈనెల 23 నుంచి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు.