Tuesday, November 26, 2024

సామాన్యుడిపై మరో భారం, గ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ పెంపు.. కొత్త కనెక్షన్‌పై 300 బాదుడు

ఆంధ్రప్రభ,అమరావతి బ్యూరో: వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలను ఇప్పటికే దశల వారీగా పెంచుతూ సామాన్యుడికి బండ భారాన్ని చేస్తున్న ప్రభుత్వాలు తాజాగా వంటగ్యాస్‌ కనెక్షన్‌ డిపాజిట్‌ను అమాంతంగా పెంచాయి. ఇప్పటివరకు రూ.1450 ఉన్న కొత్త కనెక్షన్‌ రూ.1750కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన కొత్త కనెక్షన్‌ ధరలను గురువారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇప్పటివరకు 14.2 కేజీల బరువు ఉన్న సిలిండర్‌, కొత్త కనెక్షన్‌ కావాలంటే రూ.1450 డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌తో కలిపి కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే రూ.2,650ను చెల్లించాలి. అయితే పెరిగిన కొత్త ధరల ప్రకారం అదే బరువు కలిగిన కొత్త కనెక్షన్‌ తీసుకోవాలంటే రూ.1750 డిపాజిట్‌ చేయాలి. గ్యాస్‌, రెగ్యులేటర్‌తో కలిపితే రూ.3,300 ప్రస్తుతం చెల్లించాల్సి వస్తుంది. మొత్తం మీద కొత్త కనెక్షన్‌ డిపాజిట్‌ సామాన్యుడికి మరింత భారంగా మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సుమారు లక్షకు పైగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేస్తుండగా, రోజుకు 50 వేల నుంచి 75 వేల కనెక్షన్లను మంజూరు చేస్తున్నారు.

దీన్ని బట్టి చూస్తుంటే ప్రజలపై కొత్త కనెక్షన్‌ భారం మరింత పెరగనుంది. ఒక్కొక్క కనెక్షన్‌పై రూ.300 నుంచి రూ.450 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే గ్యాస్‌ ధరలు అమాంతంగా పెరగడంతో పేద ప్రజలు గ్యాస్‌పై వంట చేయాలంటనే భయపడిపోతున్నారు. రూ.550 ఉన్న గ్యాస్‌ ధర దశల వారీగా రూ.1050కు చేరింది. తాజాగా కొత్త కనెక్షన్‌ ధరలను కూడా భారీగా పెంచేయడంతో పేద ప్రజలు గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటేనే వెనుకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. పెరిగిన డిపాజిట్‌లపై ప్రజలతో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement