Tuesday, November 26, 2024

బయటికొస్తున్న నోట్ల కట్టలు ! రిజర్వు బ్యాంకుకు భారీగా చేరుతున్న రూ.2 వేల నోట్లు

అమరావతి, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఈనెల 19 నుండి రూ.2 వేల నోట్ల ఉపసంహరణ ప్రకటన విడుదలైన తరువాత ఈనోట్లు మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన 2016లో జరిగిన సమయంలో రూ. 500, రూ. 2 వేల నోట్లను ఆర్‌బీఐ మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. అయితే, అనూహ్యంగా రూ. 2 వేల నోట్లలో 90 శాతం మేర కనిపించకుండా పోయాయి. ఇవన్నీ బడా బాబుల గల్లా పెట్టెల్లోకి వెళ్లాయని భావించిన ఆర్‌బీఐ 2018 నుండి ఈనోట్ల ముద్రణ ఆపేసింది. తాజగా ఈనెల 19న రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి సెప్టెంబరు 30 వరకూ ఈనోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈక్రమంలో కనిపించకుండా పోయిన నోట్లన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 2016 నుండి కేవలం 10 శాతం మేర మాత్రమే చలామణిలో ఉన్న ఈనోట్లు కేవలం వారం రోజుల వ్యవధిలోనే మరో 10 శాతం మేర చలామణిలోకి వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ విధంగా మార్కెట్‌లోకి వస్తున్న నోట్లన్నీ బంగారం దుకాణాలు, పెట్రోల్‌ బంక్‌ల నుండే అధికంగా వస్తున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బ్యాంకుల్లో రోజుకు రూ. 20 వేల వరకూ ఈ నోట్లను జమ చేసుకునే విధంగా ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. అయితే, ఆధార్‌, పాన్‌ లింక్‌, నోట్ల జమపై నిఘా వంటి ప్రచారాల నేపథ్యంలో బ్యాంకుల్లో ఈ నోట్ల జమ మందకొడిగా సాగుతునట్లు కూడ అధికారులు గుర్తించారని అంటున్నారు. ఏది ఏమైనా రూ.2 వేల నోట్ల ఉపసంహరణ తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ నోట్లు ఒక్కసారిగా మార్కెట్‌లోకి రావడంపట్ల ప్రజలు విస్తుపోతున్నారు. అయితే, మార్కెట్‌లోకి వస్తున్న ఈనోట్లన్నింటినీ ఆర్‌బీఐ సేకరించి భధ్రపరస్తోంది.

- Advertisement -

మార్కెట్లోకి విరివిగా వస్తున్న రూ. 2 వేల నోట్లు

నిన్నమొన్నటి వరకూ కనిపించీ కనిపించనట్లున్న రూ. 2 వేల నోట్లు ఇప్పుడు మార్కెట్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఈ నోట్ల చలామణి విపరీతంగా పెరిగినట్లు స్పష్టంగా అర్ధమౌతోంది. వాణిజ్య సముదాయాలు, పెట్రోల్‌ బంక్‌లు, బంగారు దుకాణాల్లో మరీ ముఖ్యంగా ఈనోట్ల చలామణి జరుగుతోంది. 2016 నుండి 20123 మే 19 వరకూ చలామణిలో ఉంది కేవలం 10 శాతమే అంటున్నారు నిపుణులు. ఈ నోట్ల మార్పిడికి దాదాపుగా 131 రోజుల వ్యవధి ఉంది. ఇప్పటికే ఇందులో వారం రోజులకే కేవలం మరో 10 శాతం మార్కెట్‌లోకి వస్తే ఇంకా ఉన్న 125 రోజుల్లో పూర్తిగా రూ. 2 వేల నోట్లు బయటకు వచ్చే అవకాశముందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే, ఈ నోట్ల మార్పిడికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువుకంటే ముందే అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ మొత్తం రూ. 2 వేల నోట్లు ఆర్‌బీఐకి చేరే అవకాశముందని ప్రస్తుతం నడస్తున్న ట్రెండ్‌ను బట్టి అర్ధమౌతోందని వారు పేర్కొంటున్నారు.

నోట్ల రాకపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి

ఇదిలా ఉండగా ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న నోట్లపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రతి రోజూ ఈ నోట్ల రాక ఏవిధంగా ఉందన్న దానిపై తాము నిత్య పర్యవేక్షణ ఉంచామని ఇప్పటికే ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ పర్యవేక్షణలో కూడా బ్యాంకులకు వచ్చి డిపాజిట్లు చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందని చెబుతున్నారు. బయటి మార్కెట్ల నుండే అత్యధిక మోతాదులో ఈ నోట్లు బ్యాంకులకు వచ్చి చేరుతున్నాయని చెబుతున్నారు. అందుకు బ్యాంకు నిబంధనలు కూడా కారణమని చర్చ జరుగుతుంది. ఇక పెద్ద మొత్తంలో ఈ నోట్లు జమ చేయాలంటే ఐటీ శాఖ కన్ను కూడా వారిపై ఉంటుందని, ఈనేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా ఈ డబ్బును సొమ్ముచేసుకుంటే మంచిదన్న భావనతోనే ఈ నోట్లు దాచినవారు భావిస్తున్నట్లు ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.

రద్దు అనలేదు కాబట్టి చలామణిలో ఉండే అవకాశముందంటూ ప్రచారం

ఇదిలా ఉండగా తాజాగా మరో ప్రచారం కూడా ఇప్పుడు మార్కట్‌ వర్గాల్లో నడుస్తోంది. ఆర్‌బీఐ ఈనెల 19న చేసిన ప్రకటనలో రూ. 2 వేల నోట్లు ఉపసంహరించుకున్నట్లు మాత్రమే ప్రకటించింది తప్ప రద్దు అని ఎక్కడా చెప్పలేదన్నది ఆ ప్రచారం సారాంశం. ఇప్పుడు ఈనోట్ల మార్పిడికి ఆర్‌బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబరు 30తో ముగుస్తుంది. అంటే సెప్టెంబరు 30 తరువాత కూడా ఈనోట్లు చలామణిలో ఉండే అవకాశం లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ముద్రించిన నోట్లన్నీ తమ వద్దకు చేరిన తరువాత ఈ నోట్లను రద్దుచేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటిస్తుందన్న ప్రచారం కూడా వినిపిస్తుంది. ఈగందరగోళం నేపథ్యంలో రూ. 2 వేల నోట్లను సొమ్ము చేసుకుని సేఫ్‌ జోన్‌లో ఉంటే మంచిదన్న ఆలోచనతో ఈనోట్లను దాచినవారంతా వాటిని బయటకు తీస్తున్నట్లు కనిపిస్తుంది.

డిజిటల్‌ చెల్లింపుల పెంపుపై దృష్టి

అభివృద్ధి చెందుతున్న అమోరికా వంటి అగ్ర దేశాల్లో కేవలం 25 శాతం మాత్రమే కరెన్సీ చలామణిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన కరెన్సీ మొత్తం డిజిటల్‌ చెల్లింపుల ద్వారా చలామణిలో ఉంటుందని పేర్కొంటున్నారు. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మన దేశంలో కూడా డిజిటల్‌ చెల్లింపులు పెంచే యోచనలో ఉన్నట్లు వారు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బ్యాంకింగ్‌ రంగంలో దిగ్గజంగా ఉన్న ఎస్‌బీఐ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. జీడీపీలో రి-టైల్‌ డిజిటల్‌ చెల్లింపులు (ఆర్‌టీ-జీఎస్‌ మినహా) 2016 ఆర్ధిక సంవత్సరంలో 129 శాతం ఉండగా అవి2023 ఆర్ధిక సంవ్సరానికి 242 శాతానికి చేరుకున్నాయి. అన్నింటికంటే, యూపీఐ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు మోడ్‌గా అవతరించింది, ఇది వ్యక్తి నుండి వ్యక్తికి (పీ2పీ), అలాగే వ్యక్తి నుండి వ్యాపారికి (పీ2ఎం) లావాదేవీలు మొత్తం డిజిటల్‌ చెల్లింపులలో 73 శాతం వాటాను కలిగి ఉన్నాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. యూపీఐ లావాదేవీల పరిమాణం 2017 ఆర్ధిక సంవత్సరంలో 1.8 కోట్ల నుండి 2023 ఆర్ధిక సంవత్సరంలో 8375 కోట్లకు చేరి అనేక రెట్లు- పెరిగింది. యూపీఐ లావాదేవీల విలువ కూడా బాగా పెరిగి, కేవలం రూ. 6,947 కోట్ల నుండి రూ. 139 లక్షల కోట్లకు అంటే 2004 రెట్లు- పెరిగింది. 2023 ఆర్ధిక సంవత్సరంలో జిడిపిలో 12.4 శాతానికి చేరుకునేలా చలామణిలో ఉన్న కరెన్సీ నియంత్రించబడిందని నివేదిక పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement