అనంతపురం : భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలమవుతోంది. ఒకవైపు వరదలు ముంచెత్తుతుంటే.. మరోవైపు ప్రమాదాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. కదిరి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచేశాయి. నాన్పుడు వర్షాలకు రెండు భవనాలు కూలిపోయాయి.
స్థానిక చైర్మన్ వీధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు(శనివారం) తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో అంతా నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కుప్పకూలడంతో నిద్రలో ఉన్నవారు ఆ భవన శిథిలాల కొంద చిక్కుకుపోయారు.
శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం యుద్ధ ప్రాతిపదికన తొలగించే యత్నం చేస్తోంది. అయితే భవనం శిథిలాల్లో దాదాపు 10 మంది దాకా ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల తొలగింపులో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బయటకు తీశారు. ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. చనిపోయిన చిన్నారులు సైదున్నిసా(3), పరిధున్నిసా (2) గా స్థానికులు గుర్తించారు.