కడప ప్రెస్ క్లబ్ దగ్గర నీటి గుంతలో పడ్డ రెండు గేదెలను జర్నలిస్టులు కాపాడారు. నగరపాలక సంస్థ సిబ్బంది దాదాపు 5 అడుగుల మేర గుంతలు తీసి పని పూర్తి అయినా.. వాటిని పూడ్చకుండా అలాగే వదిలేశారు. అయితే శనివారం రెండు మూగజీవాలు ఆ గుంతల్లో పడిపోయాయి. వాటిని గమనించిన విలేకరులు స్థానికులతో కలిసి అతికష్టం మీద ఒక గేదెను బయటకు తీశారు.
మరో గేదెను బయటకు తీసేందుకు వీలు కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేశారు. స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గుంతలో పడిపోయిన రెండో గేదెను కూడా బయటికి తీశారు. గుంతలు తీసి పూడ్చకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు.