అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2024-25) సమావేశాలు వచ్చేనెలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించింది. తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో లోటుపాట్లకు అనుగుణంగా మరో విడత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ఆమోదించింది. వచ్చే నెలాఖరుతో గడువు ముగియనుంది.
గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో నిధులు మళ్లింపు జరిగింది. ఆయా శాఖల పరిధిలో గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను గుర్తించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాాది జూలై నెలాఖరులోగానే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖ సర్క్యులర్ కూడా జారీ చేసింది.
అయితే పూర్తి స్థాయిలో సమగ్రమైన సమాచారం లేకపోవటంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు.. కొత్తగా పునరుద్ధరణ పథకాలకు అయ్యే ఖర్చులు.. ఆదాయం అంచనాలపై స్పష్టత రాలేదు. దీంతో డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు చివరి విడత కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆర్డినెన్స్ తెచ్చి 2025-26 బడ్జెట్ సమావేశాల్లో రెండేళ్ల బడ్జెట్‌కు ర్యాటిఫై చేసుకునే అంశాన్ని పరిశీలన జరిపింది.