Thursday, November 21, 2024

Breaking: నెల్లూరులో భార్యా భ‌ర్త‌ల దారుణ హ‌త్య‌.. చోరీ కోసం వ‌చ్చి మ‌ర్డ‌ర్ చేశారు!

నెల్లూరు క్రైం, (ప్రభ న్యూస్​): ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో దారుణం జ‌రిగింది. నిన్న (శ‌నివారం) అర్ధ‌రాత్రి భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ హ‌త్య‌కు గుర‌య్యారు. చోరీకి వ‌చ్చిన వ్య‌క్తులే ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు (52), సునీత (48) నెల్లూరులో స్థిర‌ప‌డ్డారు. 20 ఏళ్ల క్రిత‌మే నెల్లూరుకు వ‌చ్చిన వారు హోట‌ల్ బిజినెస్ చేస్తూ బీవీన‌గ‌ర్ ద‌గ్గర్లోని అశోక్‌న‌గ‌ర్‌లో సొంతిళ్లు క‌ట్టుకుని ఉంటున్నారు. వీరికి క‌రెంట్ ఆఫీస్ సెంట‌ర్‌లో శ్రీ‌రాం హోట‌ల్ ఉంది. అయితే.. ఉద‌యం హోట‌ల్ నిర్వ‌హ‌ణ‌కు వెళ్లే వీరు రాత్రికి కానీ ఇంటికి చేరుకోరు. నిన్న సునీత కాస్త ఎర్లీగా ఇంటికి రాగా, రాత్రి 11 తర్వాత కృష్ణారావు ఇంటికి చేరుకున్నాడు. ఈ క్ర‌మంలో అప్ప‌టికే ఇంట్లోకి చొర‌బ‌డ్డ దుండ‌గులు సునీత‌ను స‌వ‌క క‌ర్ర‌తో త‌ల‌పై బాది చంపేశారు.

కాగా, బీరువా త‌లుపులు రాక‌పోవ‌డంతో హ్యాండిల్‌ని విర‌గ్గొట్టారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డం, అప్పుడే కృష్ణారావు ఇంట్లోకి వ‌స్తుండ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన దుండ‌గులు అత‌డిని ఇంట్లోకి వ‌చ్చే క్ర‌మంలోనే గ‌డ‌ప బ‌య‌ట‌నే క‌త్తితో గొంతులో పొడిచి చంపేశారు. కానీ, ఇంట్లో నుంచి మాత్రం ఎట్లాంటి వ‌స్తువులు, న‌గ‌దు, న‌గ‌లు చోరీకి గురికాలేదు. కాగా, ఉద‌య‌న్నే ఇంటి ముందు ర‌క్తం మ‌డుగులో ప‌డి ఉన్న కృష్ణారావును చూసిన చుట్టుప‌క్క‌ల వారు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇక‌.. కృష్ణారావు దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమారులున్నారు. వారికి పెళ్లిళ్లు అయ్యి ఎవ‌రికి వారు స్థిర‌ప‌డ్డారు. పెద్ద‌కొడుకు సాయిచంద్ విశాఖ‌ప‌ట్నంలో పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేస్తుండ‌గా, చిన్న కొడుకు గోపీచంద్ నెల్లూరులోని రాంజీన‌గ‌ర్‌లో ఉంటూ పొగ‌తోట‌లో హోట‌ల్ న‌డుపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement